ఇన్​స్టాగ్రామ్ పోస్టులతో  సైబర్ నేరగాళ్ల ట్రాప్ 

ఇన్​స్టాగ్రామ్ పోస్టులతో  సైబర్ నేరగాళ్ల ట్రాప్ 
  • ఇన్​స్టాగ్రామ్ పోస్టులతో  సైబర్ నేరగాళ్ల ట్రాప్ 
  • పుణెకు చెందిన 8 మంది అరెస్ట్
  • రూ.60 వేల క్యాష్, 51 ఏటీఎం కార్డులు, 30 మొబైల్స్​స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు: ఖరీదైన సెల్​ఫోన్లను తక్కువ రేటుకే అమ్ముతామంటూ ఇన్​స్టాగ్రామ్ పోస్టులతో మోసాలు చేస్తున్న 8 మంది సైబర్ నేరగాళ్లను తుకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సికింద్రాబాద్​లోని డీసీపీ ఆఫీసులో నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన ఫ్రాన్సిస్కో అలియాస్ ఆకాశ్, మహారాష్ట్రలోని పుణెకు చెందిన ధ్యానేశ్వర్, నిలేశ్(24), సత్యం కల్యాణ్ కూటే(20), వినోద్ పార్టే(22), అశుతోష్ తాల్పే(23), ప్రతీక్ (23), ఓంకార్ బల్చిమ్(21), గణేశ్ మనోహర్ హంబ్రే(21), మహేశ్​భగు చిమ్టే(21) ఈ పది మంది కలిసి పుణె కేంద్రంగా స్విచ్ ఎలక్ట్రానిక్స్ అఫిషియల్స్ పేరుతో ఆఫీసు ఏర్పాటు చేశారు.  హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నుంచి 94 అకౌంట్లు తెరిచారు. పేటీఎం ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి స్విచ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో తక్కువ రేటుకే సెల్ ఫోన్లు అమ్ముతామంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్టులు పెట్టేవారు. వీటిని నమ్మి సెల్​ఫోన్ కోసం కాల్ చేసిన వారి నుంచి చార్జీల పేరుతో డబ్బులు కాజేసేవారు. సిటీకి చెందిన ప్రవలిక ఇన్ స్టాగ్రామ్​లో తక్కువ రేటుకే ఖరీదైన సెల్​ఫోన్ల పోస్టు చూసి అందులో ఉన్న నంబర్​కు కాల్ చేసింది. అవతలి వ్యక్తి కొరియర్ చార్జీలు, జీఎస్టీ, బ్యాంకు చార్జీల పేరుతో ఆమె నుంచి రూ.68,405 వసూలు చేశాడు. సెల్​ఫోన్ కొరియర్​లో డెలివరీ కాగానే.. అడిషనల్ చార్జీలు తిరిగి ఆమె బ్యాంక్ అకౌంట్​లో రీఫండ్ అవుతాయని నమ్మించాడు. ఎన్నిరోజులైనా ఆర్డర్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన ఆమె తుకారాం గేట్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పుణెకు వెళ్లి 8 మందిని అరెస్ట్ చేసి సిటీకి తీసుకొచ్చి విచారించారు. ఈ గ్యాంగ్ కాచిగూడ, కంచన్​ బాగ్​
పీఎస్​ల పరిధిలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 60 వేల క్యాష్, 30 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్ లు, 51 డెబిట్ కార్డులు, 9 సిమ్ కార్డులు, 26 క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు, స్వైపింగ్ మెషీన్, బ్యాంక్ చెక్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ఫ్రాన్సిస్కో, ధ్యానేశ్వర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ చందనా దీప్తి తెలిపారు.

రద్దీ ఏరియాల్లో మొబైల్స్ చోరీ.. ఆరుగురు అరెస్ట్

మేడ్చల్: రద్దీ ఏరియాలను టార్గెట్ చేసి సెల్ ఫోన్లను కొట్టేస్తున్న ఆరుగురిని మంగళవారం రాత్రి మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా జవహర్ నగర్ ఏరియాలో ఉంటూ జల్సాలకు బానిసై సెల్ ఫోన్ల చోరీలు చేస్తున్నారని  పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. కొట్టేసిన మొబైల్స్ ను  అబిడ్స్ లోని జగదీశ్ మార్కెట్ లో అమ్ముతున్నారన్నారు. నిందితుల నుంచి 100 సెల్ ఫోన్లు, రూ. లక్షా 25 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు, మిగతా నలుగురిని రిమాండ్ కు తరలించామన్నారు.