రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురూ: మంత్రి తుమ్మల

రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురూ: మంత్రి తుమ్మల
  • రోజుకు 10 వేల టన్నుల సరఫరాకు ఏర్పాట్లు.. పంపిణీలో సమస్యలు 
  • నివారించేందుకు పకడ్బందీ చర్యలు
  • జియో పొలిటికల్ కారణాలతో యూరియా సప్లైలో ఇబ్బందులొచ్చాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతులు ఇబ్బందులు పడకుండా రైతు వేదికల వద్ద ప్రభుత్వం యూరియా అమ్మకాలు చేపట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించడంతో అడ్మినిస్ట్రేటివ్ విభాగం రెండ్రోజుల్లోనే 500 ఈపాస్ యంత్రాలను సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సోమవారం నుంచి యూరియా పంపిణీ షురూ చేసింది. ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో యూరియా పంపిణీ సజావుగా సాగిందని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియా పంపిణీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికల్లో యూరియా పంపిణీని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సోమవారం రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ సజావుగా జరిగిందని, ఇదే విధానంలో పంపిణీ కొనసాగించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలిచ్చారు.

రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది
జియోపొలిటికల్ కారణాలతో యూరియా దిగుమతులు తగ్గడం, దేశీయ ఉత్పత్తి డిమాండ్‌‌‌‌కు సరిపోకపోవడంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో అదనంగా 40 వేల టన్నుల యూరియా సమకూర్చిందని వివరించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో ప్రతి రోజు10 వేల టన్నుల యూరియా సరఫరా చేసేలా వివిధ కంపెనీలు ఏర్పాట్లు చేశాయని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. రైతులు ఇటువంటి ప్రయత్నాలపై  అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులకు ప్రజా ప్రభుత్వం  అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.