తుమ్మల, పొంగులేటి, పువ్వాడ హాట్ కామెంట్స్.. వేడెక్కిన ఖమ్మం రాజకీయం

తుమ్మల, పొంగులేటి, పువ్వాడ హాట్ కామెంట్స్.. వేడెక్కిన ఖమ్మం రాజకీయం

న్యూఇయర్ మొదటిరోజున ఖమ్మం పాలిటిక్స్ హీటెక్కాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఎవరికి వారుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ ‘వాడవాడ పువ్వాడ’ పేరుతో ఖమ్మంలో ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా పువ్వాడ, పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని మంత్రి పువ్వాడ అజయ్ చెబుతుండగా..  తాడోపేడో తేల్చుకుంటాననే రీతిలో పొంగులేటి  శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఈ హాట్ కామెంట్స్ రానున్న రోజుల్లో ఏ రకమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 

పొంగులేటి వ్యాఖ్యల వెనుక.. 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘  ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో మనకు దక్కిన గౌరవమేంటి ? బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్ లో దక్కబోయే గౌరవమేంటో  ఆలోచించండి. గత నాలుగున్నరేళ్లలో మనకు ఏం ఇబ్బంది జరిగిందో తెలియంది కాదు’’ అని ఆయన కామెంట్ చేశారు. ఇవన్నీ ఒక్కరోజు అసంతృప్తితో చేసిన వ్యాఖ్యలు కావు. 2019 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ నాటి ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటిని కాదని.. నామా నాగేశ్వరరావుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి పొంగులేటికి పార్టీలోనూ తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఈ పరిణామాలతో నాటి నుంచి తన మనసులో గూడుకట్టుకుపోయిన వ్యతిరేకతను ఇవాళ పొంగులేటి తన వ్యాఖ్యలతో వెళ్లగక్కారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాజకీయ కుట్రలపై నోరువిప్పిన పువ్వాడ..

తన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయాలపై మంత్రి పువ్వాడ అజయ్ ఘాటుగా స్పందించారు. కొంతమంది గతంలో కార్పొరేటర్లపై విష ప్రచారం చేసి తనను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇవాళ ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘నేరుగా నాపై ఆరోపణలు చేయలేక.. కార్పొరేటర్లపై అసత్య ప్రచారాలు చేసి నాకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేశారు. అందరూ ఒక సైడ్ అయినా ప్రజలు నన్ను గెలిపించారు. ఇప్పుడు కూడా నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ డబ్బుతోనే కొనలేమనేది కొందరు గుర్తుంచుకోవాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తిప్పికొడ్తరు’’ అని పువ్వాడ స్పష్టం చేశారు. 

యాక్టివిటీ పెంచిన తుమ్మల..

ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. బీఆర్ఎస్ లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దరిలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి పాలేరు టికెట్ ఇస్తుందనే దానిపై గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు పాలేరుపై తన గ్రిప్ ను పెంచుకునే క్రమంలోనే ఇవాళ న్యూఇయర్ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల చేసిన కృషిపై దాదాపు 10వేల పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ‘‘నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశా. నా రాజకీయ జీవితం  సంతృప్తినిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధిని చూస్తున్నారు’’ అని తుమ్మల ఇవాళ వ్యాఖ్యానించారు. పాలేరు అసెంబ్లీ టికెట్ రేసులో ముందుండే ప్రయత్నంలో భాగంగానే  ఆయన నియోజకవర్గంలో యాక్టివిటీని పెంచారని పరిశీలకులు అంటున్నారు.