- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో తుమ్మల భేటీ
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు రైతుల భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, సత్తుపల్లి ట్రంక్ పనులను స్పీడప్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో తుమ్మల భేటీ అయి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, భూసేకరణ, పైప్‌లైన్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.
భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రైతులకు పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి ట్రంక్ పనులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఈ పనులు పూర్తయితే సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయన విజ్ఞప్తులపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా పెండింగ్ పనులను వేగవంతం చేయడం, భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
