తుమ్మిడిహెట్టిలో వంపులే సమస్య!... వంపు లేకుండా లంబకోణ పద్ధతిలో కట్టాలని సీడబ్ల్యూసీ సూచన

తుమ్మిడిహెట్టిలో వంపులే సమస్య!... వంపు లేకుండా లంబకోణ పద్ధతిలో కట్టాలని సీడబ్ల్యూసీ సూచన
  •     70 డిగ్రీల వంపు  వస్తున్నట్టు సర్వేలో తేలిన వైనం
  •     జైపూర్​కు నీటిని తరలించాలంటే లిఫ్ట్ కట్టాలంటున్న సంస్థ
  •     దానికి బదులు సుందిళ్లకు తీసుకెళ్లడమే బెటర్ అన్న అభిప్రాయాలు 

హైదరాబాద్, వెలుగు:  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీలో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. బ్యారేజీ నిర్మించే ప్రదేశంలో ఇటీవల ఆర్వీ అసోసియేట్స్ సంస్థ ప్రాథమిక సర్వే చేసింది. అందులో భాగంగా ఆ ప్రాంతంలో బ్యారేజీని నిర్మిస్తే 70 డిగ్రీల కోణంతో నాలుగైదు వంపులు(స్కూ) వస్తున్నట్టు తేల్చారు. ఈ క్రమంలోనే ఆ వంపులను వీలైనంత వరకు తగ్గించేందుకు ఆర్వీ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నది. అందులోభాగంగానే సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) నిపుణుల సలహాను నిర్మాణ సంస్థ కోరినట్టు తెలిసింది. ఆ సర్వే వివరాలను పరిశీలించిన సీడబ్ల్యూసీ.. స్కూ లేకుండానే బ్యారేజీని నిర్మించాలని సూచించినట్టు తెలిసింది. 

పర్పెండిక్యులర్(లంబకోణం) పద్ధతిలో బ్యారేజీని నిర్మించాలని సలహా ఇచ్చినట్టు సమాచారం. స్కూ ఎక్కువుంటే బ్యారేజీ పటిష్ఠతకు ప్రమాదం పొంచి ఉంటుందని, అలల తాకిడి వంపుల్లో ఒకలాగా మిగతా చోట్ల మరోలా ఉండి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పినట్టు తెలిసింది. ఇటు ఆపరేషన్ ప్రొటోకాల్స్​లోనూ సమస్యలు రావొచ్చని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే లంబకోణంలో.. 90 డిగ్రీల యాంగిల్​లో నిర్మిస్తే ఆ ప్రభావం ఉండదని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆర్వీ అసోసియేట్స్ మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

నేరుగా సుందిళ్లకేనా?

తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తే.. రెండు ఆప్షన్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఇప్పటికే ఉన్న నెట్​వర్క్​ను వాడుకుంటూ సుందిళ్ల వరకు ఎక్స్​టెండ్ చేసి నీటిని తరలించాలని భావించింది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి తీసుకెళ్లాలని యోచించింది. అది కాకుండా మధ్యలోనే జైపూర్ వాగులోకి కూడా నీటిని తరలించి ఎల్లంపల్లికి నీళ్లను తీసుకెళ్లొచ్చనీ భావించింది. 

దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే కూడా చేశారు. జైపూర్​ వాగులోకి నీళ్లను తరలించేందుకు అనువుగా ఉందని తేల్చారు. అయితే, నిర్మాణ సంస్థ మాత్రం తుమ్మిడిహెట్టి నుంచి జైపూర్ వాగుకు నీటిని తరలించడం కష్టమవుతుందని చెబుతున్నట్టు తెలిసింది. దానికి కారణం.. బ్యారేజీ లెవెల్​తో పోలిస్తే జైపూర్ వాగు ఎత్తులో ఉన్నదని సంస్థ సర్వేలో తేలిందని సమాచారం. 

ఇదే విషయాన్ని ఇటీవల అధికారుల దృష్టికి సంస్థ ప్రతినిధులు తీసుకొచ్చినట్టు తెలిసింది. జైపూర్​కు తరలించాలనుకుంటే అదనంగా మరో లిఫ్ట్ పెట్టాల్సి ఉంటుందని చెప్పారని తెలిసింది. అయితే, సంస్థ చెబుతున్న విషయాన్ని అధికారులు కొట్టిపారేసినట్టు తెలిసింది. డిపార్ట్​మెంట్ చేసిన సర్వేలో జైపూర్ వాగుకు లిఫ్ట్ అవసరం లేకుండానే నీటిని తీసుకెళ్లొచ్చని తేలిందని సంస్థ ప్రతినిధులకు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించినట్టు తెలిసింది.