- ప్రస్తుత సైట్ వద్ద బ్యారేజీకి 68 నుంచి 70 డిగ్రీలదాకా వంపు
- ఆ వంపును తగ్గించే అంశంపై సర్వే
- సుందిళ్లతో అవసరం లేకుండానే జైపూర్ వాగు నుంచే ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లొచ్చన్న అభిప్రాయాలు
- ఆ అలైన్మెంట్ పైనా స్టడీ చేయనున్న ఏజెన్సీ
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తున్నది. ఇప్పటికే తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు అక్కడి నుంచి సుందిళ్ల వరకు అలైన్‌మెంట్‌కు డీపీఆర్ తయారీ బాధ్యతలను ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో డీపీఆర్‌ను సబ్మిట్ చేసేలా ప్రభుత్వం గడువు విధించగా.. వారం క్రితం ఆ సంస్థ బ్యారేజ్ సైట్ వద్ద ప్రిలిమినరీ పనులను స్టార్ట్ చేసింది. నెల రోజులుగా బ్యారేజ్ సైట్ వద్ద సంస్థ ప్రతినిధులు సర్వే పనులు నిర్వహిస్తున్నారు.
అక్కడ ఉన్న స్థలాన్ని సంస్థ నిపుణులు పరిశీలించారు. అయితే, అక్కడ బ్యారేజీని నిర్మిస్తే 68 నుంచి 70 డిగ్రీల కోణంలో స్కూ (వంపు) వస్తున్నట్టు గుర్తించారు. రెండుమూడు చోట్ల బ్యారేజీ వంకర్లు పోతున్నట్టు సంస్థ ప్రతినిధులు తేల్చారు. ఈ క్రమంలోనే ఆ స్కూను వీలైనంత వరకు తగ్గించుకునేలా ఏం చేయొచ్చనే దానిపై ఆర్వీ సంస్థ సర్వేలు చేయిస్తున్నట్టు చెబుతున్నారు.
వంపు ఎంత ఎక్కువైతే.. బ్యారేజీ ఎఫిషియెన్సీ, పటిష్ఠత అంత తగ్గుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బ్యారేజీ వంపులు తగ్గేలా ఏ కోణంలో నిర్మిస్తే బాగుంటుందన్న అంశంపై సర్వే చేస్తున్నారంటున్నారు. అందుకు అనుగుణంగానే జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నదని చెబుతున్నారు.
చాప్రాల్ అభయారణ్యంపైనా అధ్యయనం..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తే తమ భూభాగం ముంపునకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రధానమైన అభ్యంతరం. ఆ భూమితో పాటే గడ్చిరోలి జిల్లాలో ఉన్న చాప్రాల్ అభయారణ్యంపైనా ఎఫెక్ట్ పడుతుందని వాదిస్తూ వస్తున్నది. పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా ఆ రాష్ట్రం ఒప్పుకోవడం లేదు.
ఈ క్రమంలోనే వైల్డ్‌లైఫ్ శాంక్చువరీ ఉన్న చాప్రాల్ అభయారణ్యంపైనా సంస్థ స్టడీ చేస్తున్నది. బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో ఆ అభయారణ్యంలో ఎంత పరిధి వరకు ముంపుకు గురువుతుంది.. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలుగుతుంది.. వంటి అంశాలపై ప్రాథమికంగా అధ్యయనం చేసేందుకు కసరత్తులు చేస్తున్నది.
అంతేగాకుండా ప్రాజెక్ట్‌లో భాగంగా బ్యారేజీతోపాటు నిర్మించే అలైన్‌మెంట్‌పైనా సంస్థ సర్వేలు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో వాడుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి అక్కడి నుంచి 71 కిలోమీటర్ల దూరంలోని మైలారం వరకు తరలించి అక్కడి నుంచి మధ్యలోని జైపూర్ (టేకుమట్ల) వాగుకు అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి తరలించి.. ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలని నిర్ణయించింది.
అయితే, సుందిళ్ల అవసరం లేకుండానే ఎల్లంపల్లికి నీటిని తరలించొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నట్టు తెలిసింది. మైలారం నుంచి సుందిళ్లకు మధ్యలో ఉన్న జైపూర్ వాగులోకే నీటిని తరలించి.. అక్కడి నుంచి నేరుగా ఎల్లంపల్లికి తరలించేందుకు అవకాశం ఉందని చెబుతున్నట్టు తెలిసింది.
దీనిపైనా ఆర్వీ సంస్థ సర్వే, స్టడీలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. దాంతోపాటు సుందిళ్ల అలైన్‌మెంట్‌కూ సర్వేలు చేయనుంది. ఒకవేళ జైపూర్ వాగు నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్తే.. సుందిళ్ల బ్యారేజీ అవసరం రాదని చెబుతున్నారు. అయితే, సుందిళ్ల బ్యారేజీ ఎగువన నిర్మించిన సిస్టమ్‌ను వాడుకునేందుకు అవకాశం ఉంటుందా అనే అంశాన్ని స్టడీ చేయనున్నట్టు చెబుతున్నారు.
