
- ధర ఖరారు కావడంతో సేకరణ షురూ
- 50 ఆకుల కట్టకు రూ.3.30 ధర ప్రకటన
- పొద్దుపొద్దునే అడవిబాట పడుతున్న ఆదివాసీలు
- అటవీ ఉత్పత్తులు తగ్గిన వేళ.. ఇదే వారికి ఆశాదీపం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గిరిపల్లెల్లో తునికాకు పండుగ షురూ అయ్యింది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు కుదిరి ధర ఖరారు కావడంతో ఆదివాసీలు పొద్దుపొద్దునే అడవిబాట పడుతున్నారు.
17,200 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యం
జిల్లాలో31 యూనిట్ల ద్వారా 17,200 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించింది. టెండర్లు పూర్తయినా జిల్లాలోని కొన్ని యూనిట్లలో అగ్రిమెంట్లు ఆలస్యమయ్యాయి. కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. కానీ ఆఫీసర్లు వారితో మాట్లాడి ఆలస్యమైన ఎట్టకేలకు అగ్రిమెంట్లు చేయించారు. భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, పాల్వంచ వైల్డ్ లైఫ్ డివిజన్లలో సేకరణ చేపట్టనున్నారు. భద్రాచలం డివిజన్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో అగ్రిమెంట్లు చేసుకోవడానికి కాంట్రాక్టర్లు మొండికేశారు.
భద్రాచలం డివిజన్లో ప్రభుత్వం 50 ఆకుల కట్టకు రూ.3.30లు ధర ప్రకటించింది. కానీ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్లతో చర్చలు జరపడంతో రెండు పైసలు అదనంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఒక్కో యూనిట్లో ఒక్కో తీరుగా కాంట్రాక్టర్లు అదనపు ధరను ప్రకటించారు. గుండాల ప్రాంతంలో ఒక పైసా మాత్రమే ఇస్తామని కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు.
ప్రధాన ఆదాయవనరు ఇదే..
అటవీ ఉత్పత్తులు తగ్గిన వేళ ఆదివాసీలకు తునికాకు సేకరణ ఆశాదీపంగా మారింది. చింతపండు, ఉసిరి, కరక్కాయలు, చీపుళ్లు, తేనె, విప్పపువ్వు, జిగురు లాంటివి రావడం లేదు. మరోవైపు ఉపాధి పనులకు వెళ్తూ అటవీ ఉత్పత్తుల సేకరణకు ఆదివాసీలు కొంత కాలంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అడవులను ఇష్టారాజ్యంగా నరికేయడంతో ఒకప్పుడు ఉపాధి చూపిన చెట్లు అంతరించి పోయాయి. అడవుల్లోకి వెళ్లాలంటే చత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్లో ఆపరేషన్ గ్రీన్హంట్, ఆపరేషన్ కగార్ లాంటి ఉద్రిక్తతలతో భయపడుతున్నారు. ఇటువంటి సమయంలో గ్రామాలకు సమీపంలో ఉండే తునికాకు వారికి ప్రధాన ఆదాయవనరుగా మారింది.
రేటు విషయంలో ఒప్పందం కుదిరింది
తునికాకు రేటు విషయంలో కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదిరింది. రెండు పైసలు అదనంగా ప్రభుత్వం ఇచ్చే ధరకు కలిపి ఇవ్వనున్నారు. 50 ఆకుల కట్టకు
రూ.3.32 ఇస్తారు. వేసవి కాలంలో మా గిరిజన కుటుంబాలకు తునికాకు
ఆసరాగా నిలుస్తుంది.
కారం పుల్లయ్య, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు