ఉత్తరాఖండ్​లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్​లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరకాశీ:  ఉత్తరాఖండ్​లో కుప్పకూలిన టన్నెల్​లో 41 మంది కార్మికులు చిక్కుకుని వారం రోజులవుతోంది. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​కు అడ్డంకులు ఎదురవుతుండడంతో ఫైవ్ ప్లాన్ స్ట్రాటజీ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సహాయక చర్యలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

‘‘మేం ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఫైవ్ ప్లాన్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాం. టన్నెల్ కు రెండు వైపులా సమాంతరంగా డ్రిల్లింగ్, టన్నెల్ పైవైపు నుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ తో పాటు రైట్ యాంగిల్ డ్రిల్లింగ్ ఒకేసారి చేయాలని నిర్ణయించాం. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు ఇంకో నాలుగైదు రోజులు పట్టొచ్చు. 

దేవుడి దయ ఉంటే, అంతకంటే ముందే కార్మికులను కాపాడతాం” అని ప్రధాని మాజీ సలహాదారు, ఉత్తరాఖండ్ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే ఆదివారం తెలిపారు. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ చేసేందుకు, అక్కడికి అవసరమైన యంత్రాలను పంపేందుకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) రోడ్డు వేస్తోందని చెప్పారు. కాగా, కార్మికులకు మొదటి రోజు నుంచి మల్టీ విటమిన్స్, యాంటీడిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ పంపిస్తున్నామని కేంద్ర రవాణా శాఖ సెక్రటరీ అనురాగ్ జైన్ తెలిపారు. టన్నెల్ లో కార్మికులు చిక్కుకున్న ప్రదేశంలో కరెంట్, నీళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

రెండ్రోజుల్లో బయటకు తీసుకొస్తం: గడ్కరీ 

అంతా అనుకున్నట్టు జరిగితే మరో రెండ్రోజుల్లో కార్మికులను బయటకు తీసుకొస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆదివారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో కలిసి టన్నెల్ దగ్గరికి ఆయన వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘వీలైనంత త్వరగా కార్మికులను కాపాడటమే మా ధ్యేయం. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నం. కానీ ఇక్కడున్న పరిస్థితుల వల్ల రెస్క్యూ ఆపరేషన్ సవాల్​గా మారింది.

 కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉన్న అన్ని పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నం. మేం మొత్తం 6 ప్రత్యామ్నాయాలపై పని చేస్తున్నాం. సమాంతరంగా, నిలువునా డ్రిల్లింగ్ చేస్తున్నాం. ఇందుకోసం అవసరమైన భారీ యంత్రాలు తెప్పించినం. అమెరికన్ ఆగర్ మెషిన్ బాగా పని చేస్తే, మరో రెండు మూడు రోజుల్లోనే కార్మికులను చేరుకోగలం” అని గడ్కరీ చెప్పారు.