కరోనా బాధిత జర్నలిస్ట్ ఫ్యామిలీలను ఆదుకోండి..

కరోనా బాధిత జర్నలిస్ట్ ఫ్యామిలీలను ఆదుకోండి..

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా దుష్ప్రభావంతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులను, వాళ్ల ఫ్యామిలీలను ఆదుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్– హెచ్143 ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీ ప్రెస్ క్లబ్​లో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అవ్వారి భాస్కర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం టీయూడబ్ల్యూజే  ప్రతినిధులు మాట్లాడుతూ.. కరోనాతో తెలంగాణలో దాదాపు 64 మంది జర్నలిస్టులు  చనిపోయారని తెలిపారు.

 మరో 4 వేల మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారని గుర్తుచేశారు. చనిపోయిన 64 మంది జర్నలిస్ట్ కుటుంబాలకు  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి రూ.1.28 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ప్రతి నెలా వారి కుటుంబాలకు రూ.3 వేల పెన్షన్ అందుతోందన్నారు. కరోనా బారిన పడిన 4 వేల మంది జర్నలిస్టులకు రూ.6 కోట్ల ఆర్థిక సాయం అందిందన్నారు.

 అయినా కరోనా దుష్ప్రభావంతో  జర్నలిస్టులు ఇప్పటికి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఇటీవల 20 మందికి పైగా జర్నలిస్టులు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.  జర్నలిస్టులను, మీడియా సంస్థలు తిరిగి నిలదొక్కుకునేలా పీసీఐ ఆర్థిక చేయూత అందించాలని టీయూడబ్ల్యూజే డెలిగెట్స్ రిక్వెస్ట్ చేశారు. 

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వెంకటేశ్ నాగిల్ల, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఈసీ మెంబర్ తిరుపతి నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.