
మెరుగు పడనున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ స్పీడ్, వాయిస్ కాల్స్
భారత్‌ఫైబర్‌తో మరిన్ని సేవలు తెచ్చేందుకు రంగం సిద్ధం
తెలంగాణలోనే మొదట ప్రారంభం
ఆప్టికల్ బ్రాడ్‌బాండ్ సేవల విస్తరణ
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు సరికొత్త సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్, భారత్ ఎయిర్ ఫైబర్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ సేవలను ఈ నెల 22న కరీంనగర్‌లోని వీణవంక నుంచి ప్రారంభించనుంది. దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ సర్కిల్‌లో దీనిని ప్రారంభించనున్నారు. భారత్‌ఫైబర్ ద్వారా వాయిస్(ల్యాండ్‌లైన్), హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగదారులు పొందుతారు. అంతేకాకుండా లోకల్ చానెల్ పార్టనర్లతో కలిసి టీవీ సర్వీసులను కూడా దీని ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ అందిచనుంది. భవిష్యత్తులో భారత్‌ఫైబర్ ద్వారా ఓటీటీ(ఓవర్ ది టాప్) సేవలను కూడా అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు, డైరక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజల్ అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు భారత్ ఎయిర్‌ఫైబర్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన భారత్ ఫైబర్ బిజినెస్ కాన్‌క్లేవ్‌లో లోకల్ పార్టనర్లతో బీఎస్ఎన్‌ఎల్ అధికారులు సమావేశమయ్యారు. రెవెన్యూ అగ్రిమెంట్ కుదుర్చుకొని భారత్ ఫైబర్ ద్వారా టీవీ సేవలను అందించాలని నిర్ణయించారు. బీఎస్‌ఎన్‌ఎల్ భారత్‌ఫైబర్ పార్టనర్లు, బీఎస్‌ఎన్‌ఎల్ డిజిటల్ గ్రామ్ సేవక్ ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికి 200 ఎంబీపీఎస్ స్పీడ్ గల బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తామని వివేక్ అన్నారు. దీని ద్వారా ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్‌కు సాయపడతామన్నారు.
తెలంగాణ సర్కిల్‌లో రెవెన్యూ రూ. 730 కోట్లు..
తెలంగాణ సర్కిల్‌లో భారత్ ఫైబర్ వ్యాపారం ద్వారా ఏడాదికి రూ. 730 కోట్ల రెవెన్యూను సాధించే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్ సీజీఎం, తెలంగాణ టెలికాం సర్కిల్ వీ. సుందర్ అన్నారు. 200 మంది లోకల్ పార్టనర్లతో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో ని10 శాతం ఇళ్లు, భారత్ ఫైబర్ సేవలను వినియోగించేలా చేయడమే లక్ష్యమన్నారు. దీనిని డిసెంబర్,2022 నాటికి చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ఫైబర్ బిజినెస్ కాన్‌క్లేవ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్, బిజినెస్ ఇన్సెంటీవ్స్ గురించి లోకల్ పార్టనర్లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి 11 మంది లోకల్ పార్టనర్లు వచ్చారు. భారత్ ఫైబర్‌లో భాగంగా స్టాండర్డ్ చార్జీలను గురించి అధికారులు బయటపెట్టలేదు. కానీ ఇతర నెట్‌వర్క్‌ల కంటే తక్కువగా ఉంటుందని తెలిపారు. వైఫై కాలింగ్స్ గురించి మాట్లాడుతూ..బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే ‘వింగ్’ పేరుతో వైఫై సేవలను అందిస్తోందని, కానీ ప్రజలలో దీనిపై అవగాహన కల్పించాలన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సర్వీసులు..
జీఎస్‌ఎం ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణ సర్కిల్‌లో 308 ప్రాంతాలలో 4జీ సేవలను ప్రారంభించింది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ 15 ఎంబీపీఎస్ నుంచి 25 ఎంబీపీఎస్‌కు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 123 కోట్లని తెలిపారు. హైదరాబాద్ కాకుండా 20 కి పైగా ఇతర జిల్లా హెడ్‌క్వార్టర్లను కవర్ చేసే 46 స్టేషన్లలో 4 జీ సేవలను కంపెనీ ప్రారంభించింది. హైదరాబాద్‌లో పాక్షికంగా 4 జీ సేవలను అందిస్తోంది. ఈ సిటీలలో 23 ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా 4 జీ సర్వీసులను ప్రారంభించింది. ఈ జీఎస్‌ఎం ప్రాజెక్టులో భాగంగా మరో 672 ప్రాంతాలలో 3జీ సేవలను అందిస్తోంది. మొత్తంగా తెలంగాణ సర్కిల్‌లో 3,476 ప్రాంతాలలో 2జీ సేవలను, 2,457 ప్రాంతాలలో 3జీ, 308 ప్రాంతాలలో 4జీ సేవలను అందిస్తోంది.