V6 News

పుదుచ్చేరిని చూసి నేర్చుకోండి.. డీఎంకే సర్కారుకు విజయ్ చురకలు

పుదుచ్చేరిని చూసి నేర్చుకోండి.. డీఎంకే సర్కారుకు విజయ్ చురకలు

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని డీఎంకే ప్రభుత్వానికి టీఎంకే పార్టీ చీఫ్ విజయ్ హితవు పలికారు. పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరిపాలిస్తోందని ఆయన కొనియాడారు. మంగళవారం పుదుచ్చేరిలోని ఉప్పళం మైదానంలో టీఎంకే మొదటిసారిగా నిర్వహించిన బహిరంగ సభలో విజయ్  మాట్లాడారు. పుదుచ్చేరి ప్రభుత్వం కచ్చితంగా డీఎంకే సర్కారు లాంటిది కాదన్నారు. 

రాజకీయ ప్రత్యర్థులమే అయినా ప్రభుత్వం ఈ సభకు సెక్యూరిటీ కల్పించిందని, ఇది చూసి డీఎంకే సర్కారు నేర్చుకోవాలన్నారు. ‘‘మీరు (డీఎంకే) మారితే మంచిది. కానీ, మీరు మారరు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు. సభకు భద్రతా ఏర్పాట్లు చేసినందుకు రంగస్వామి సర్కారుకు థ్యాంక్స్” అని విజయ్  పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా డీఎంకే పార్టీని నమ్మొద్దని, నమ్మించి మోసం చేయడమే ఆ పార్టీ పని అంటూ పుదుచ్చేరి ప్రజలకు విజయ్ విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపైనా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్  చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్  అయ్యారు. ఈ ప్రాంతానికి నిధుల విషయంలోనూ కేంద్రం పక్షపాతం చూపుతోందని విమర్శించారు.

నిధుల విషయంలోనూ పుదుచ్చేరికి అన్యాయమే

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కోసం ఈ ఏడాది మార్చి 27న అసెంబ్లీ 16వసారి ఒక తీర్మానాన్ని పాస్ చేసిందని, అయినా కూడా కేంద్రం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టిందని విజయ్ మండిపడ్డారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం మోదీ సర్కారు నిధులు ఇవ్వడంలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరని, తమకు రెండూ ఒక్కటే అని అన్నారు. తమిళనాడుకు, ఈ ప్రాంత ప్రజలకు మధ్య విడదీయరాని సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

20 లక్షల జనాభా ఉన్న పుదుచ్చేరిని కనీసం సెంట్రల్​ ఫైనాన్స్ కమిషన్‎లోనూ చేర్చలేదని, దీంతో నిధుల విషయంలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఏటా కేంద్రం విడుదలచేసే నిధులు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, స్కీమ్ లకే సరిపోతున్నాయని, దీంతో ఇతర అవసరాల కోసం బయటి నుంచి అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి కావాలంటే రాష్ట్ర హోదా ఒక్కటే మార్గమని తెలిపారు.