
హైదరాబాద్, వెలుగు: టీవీఎస్ మోటర్ కంపెనీ మన దేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్టార్క్ 150ని హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1,19,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ కేవలం 6.3 సెకన్లలో 0-–60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 104 కిలోమీటర్లు. ఈ విభాగంలో ఇదే అత్యంత వేగవంతమైన స్కూటర్.
ఇందులో 149.7 సీసీ రేస్-ట్యూన్డ్, ఎయిర్-కూల్డ్, ఓ3సీటెక్ ఇంజిన్ ఉంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 పీఎస్ శక్తిని, 5,500 ఆర్‌పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భద్రత కోసం ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ వింగ్‌లెట్‌లు, కలర్ అల్లాయ్ వీల్స్, 'టీ'-టెయిల్‌ల్యాంప్స్, టీఎఫ్‌టీ క్లస్టర్, అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, లైవ్ ట్రాకింగ్, నేవిగేషన్, ఓటీఏ అప్‌డేట్‌లతో సహా 50కి పైగా స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.