ప్రాణహితపై రెండు బ్యారేజీలు!..వార్ధాపై ఒకటి, వైన్ గంగపై మరొకటి

ప్రాణహితపై రెండు బ్యారేజీలు!..వార్ధాపై ఒకటి, వైన్ గంగపై మరొకటి
  • ఆ రెండింటినీ కనెక్ట్​ చేసేలా భారీ కాంక్రీట్​బండ్​
  • వార్ధా వైపు నుంచి ఇప్పటికే ఉన్న 
  • కెనాల్​తో సుందిళ్లకు నీళ్లు
  • 22 కిలోమీటర్ల మేర సొరంగం.. 
  • ఐదున్నర కిలోమీటర్ల ఓపెన్​ కెనాల్​
  • అలైన్​మెంట్​ను దాదాపు ఖరారు
  • వారంలో సీఎంల మీటింగ్​ను 
  • ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు
  • ఈ నెల 10న ప్రధాని మోదీతో మాట్లాడించేలా ప్రయత్నాలు
  • నేడు తుమ్మిడిహెట్టికి మంత్రులు వివేక్​, జూపల్లి 

హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత ప్రాజెక్టు అలైన్​మెంట్లు ఖరారయ్యాయి. కెనాల్​ నెట్​వర్క్​ కూ ఇంజినీర్లు తుదిరూపు ఇచ్చారు. కొత్త అలైన్​మెంట్​లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద రెండు బ్యారేజీలను నిర్మించనున్నారు. ఇంతకుముందున్న అలైన్​మెంట్లలోనూ పలు మార్పులు చేర్పులు చేశారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఒరిజినల్​ సైట్​కు  ఎగువన వార్ధా, వైన్​గంగ నదుల సంగమం వద్దే బ్యారేజీని వంపులుగా (లంబకోణం/స్కూ వచ్చేలా) నిర్మించాలని నిర్ణయించారు. 

ఈ ప్రతిపాదనలో భాగంగా మొత్తం  6.5 కిలోమీటర్ల పొడవుతో  వార్ధా మీద ఒక బ్యారేజీ, వైన్​గంగపై మరో బ్యారేజీ, ఆ రెండింటిని కలుపుతూ మధ్యలో భారీ కాంక్రీట్​ బండ్ ​నిర్మించనున్నారు.  ఆ రెండు బ్యారేజీలకు ఎర్త్​బండ్​లను కట్టనున్నారు. వాస్తవానికి గతంలో రెండు నదుల సంగమం వద్ద బ్యారేజీ నిర్మించాలనుకున్నప్పటికీ వరదల ప్రభావం వల్ల బ్యారేజీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన లేవనెత్తారు. అదే ప్రదేశం వద్ద బ్యారేజీ సైట్​ను కొంచెం మార్చి లంభకోణంలో నిర్మిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చని సూచించారు. ఆ సూచనలకు తగ్గట్టుగానే మూడో ప్రత్యామ్నాయంగా రెండు బ్యారేజీల నిర్ణయం తీసుకున్నట్టు ఇంజినీరింగ్​ అధికారులు చెప్తున్నారు.పాత కెనాల్​ నెట్​వర్క్​ను వాడుకుంటూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని గత కాంగ్రెస్​ ప్రభుత్వం భావించింది. 

ఈ క్రమంలోనే హెడ్​వర్క్స్​ కు ముందే 71.5 కిలోమీటర్ల మేర కెనాల్​ నెట్​వర్క్​ను  పూర్తి చేసింది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే మైలారం వద్ద చిన్న లిఫ్ట్ నిర్మించాల్సి ఉంటుందని గతంలో అధికారులు ప్రతిపాదించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చాక రీ ఇంజినీరింగ్​ పేరుతో ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం బ్యారేజీలు నిర్మించింది. ఇందులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయించింది. 

పాత కెనాల్​ నెట్​వర్క్​ను వినియోగించుకుంటూనే ప్రత్యామ్నాయాలపై స్టడీ చేయించింది. తాజాగా ఇప్పుడున్న 71.5 కిలోమీటర్​ పాయింట్​ నుంచి సుందిళ్లకు నీటిని తరలించి.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్​ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడున్న కెనాల్​ నెట్​వర్క్​ నుంచి 22 కిలోమీటర్ల మేర టన్నెల్​ను, ఆ తర్వాత ఐదున్నర కిలోమీటర్ల ఓపెన్​ కెనాల్​ను నిర్మించి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తరలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీలోనూ లోపాలున్నా.. అవి స్వల్పమైనవే కావడంతో వీలైనంత త్వరగా రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగూ వినియోగంలో లేదు కాబట్టి.. తుమ్మిడిహెట్టి ద్వారా నీటిని తరలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 16.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని భావిస్తున్నది. మరో ఒకట్రెండు నెలల్లో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్​ కూడా రెడీ అయ్యే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

నేడు తుమ్మిడిహెట్టికి మంత్రులు వివేక్​, జూపల్లి 

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అలైన్​మెంట్​ ఖరారైన నేపథ్యంలో మంత్రులు వివేక్​ వెంకటస్వామి, జూపల్లి కృష్ణా రావు ప్రాజెక్ట్​ సైట్​వద్ద పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయమే బ్యారేజీ నిర్మించాలనుకుంటున్న సైట్​ను, కెనాల్​ అలైన్​మెంట్​ నెట్​వర్క్​ను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. కొత్త అలైన్​మెంట్​తో వచ్చే నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్​ ఆదేశాలతో ఆదిలాబాద్​ జిల్లా మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఆ జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు గురువారం రాత్రే అక్కడకు వెళ్లారు. 

అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులతో ప్రాజెక్ట్​పై సెక్రటేరియెట్​లో రివ్యూ చేశారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, అలైన్​మెంట్లు, ఆయకట్టు తదితర వివరాలను ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్, నీటి లభ్యత, సాంకేతిక అంశాలపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ రివ్యూలో ఎమ్మెల్సీ దండే విఠల్, నీటిపారుదల శాఖ  జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

వారంలో సీఎంల సమావేశం!

బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపబోతోంది. అందుకు తగ్గట్టుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​తో సీఎం రేవంత్​ సమావేశానికి అపాయింట్​మెంట్ ​కోసం ఇప్పటికే ఆ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. ఒక వారంలో సీఎంల స్థాయి మీటింగ్​ను నిర్వహించేలా కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రాబోతున్నారు. 

దీంతో అదే రోజు ప్రధాని అపాయింట్​మెంట్​తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో.. ఒకసారి ప్రధాని మోదీతో మాట్లాడిస్తే సీఎంల మీటింగ్​ ఈజీ అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు