ట్విట్టర్ను మూసేస్తామని బెదిరించారు..బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు

ట్విట్టర్ను మూసేస్తామని బెదిరించారు..బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.  రైతులు సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం తమను బెదిరించిందని చెప్పారు. భారత్‌లో ట్విటర్ ను నిషేధిస్తామని బెదిరింపులకు దిగిందని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  జాక్ డోర్సే ఈ విషయాన్ని వెల్లడించాడు. జాక్ డోర్సే వీడియోను  ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలంగా మారాయి.

 ఏమన్నారంటే..

సాగు చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా  దేశ వ్యాప్తంగా అనేక మంది  ట్వి్ట్టర్ లో పోస్టులు పెట్టారని జాక్ డోర్సే తెలిపారు. అయితే ఈ పోస్టులను బ్లాక్ చేయాలని తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి  అనేక సిఫార్సులు వచ్చాయన్నారు. లేకపోతే భారత్ లో ట్విటర్ నుసైతం మూసివేస్తామని బెదిరించారని చెప్పారు. బ్లాక్ చేయకపోతే భారత్ లోని ట్విట్టర్  అధికారుల ఇళ్లపై దాడులు చేస్తామని బెదిరింపులకు దిగారని  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఇలా జరగడం తనను ఆశ్చర్యానికి గరిచేసిందన్నాడు. 

డోర్సే వ్యాఖ్యలు అవాస్తవం.

రైతు చట్టాలపై నిరసన సమయంలో కేంద్ర  ప్రభుత్వం నుంచి  ఒత్తిడి ఎదుర్కొన్నామన్న జాక్ డోర్సే వ్యాఖ్యలపై  కేంద్రం ప్రభుత్వం స్పందించింది. డోర్సే వ్యాఖ్యలను కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  కొట్టిపారేశారు.  డోర్సే చెబుతున్న విషయాలు పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. డోర్సే హయాంలో ట్విట్టర్ భారత చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడించారు. 2020-2022 మధ్య కాలంలో అనేక సార్లు నిబంధనలను అతిక్రమించిందని చెప్పారు. జూన్ 2022 తర్వాత ట్విట్టర్ భారత నిబంధనలకు అనుగుణంగా నడుచుకుందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి డోర్సే హయాంలో ట్విట్టర్ విముఖత చూపిందన్నారు. 

అమెరికాలో జరిగితా అలా..ఇక్కడ  జరిగితే ఇలా..

అమెరికాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే అక్కడ ట్విట్టర్ వెంటనే తొలగించిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. కానీ భారత్ లో మాత్రం తొలగించలేదన్నారు. డోర్సే హయాంలో ట్విట్టర్ పక్షపాత వైఖరి అనుసరించిందని..ఇదే అందుకు నిదర్శనమన్నారు. ఆయన ఆరోపించినట్లుగా కేంద్ర ట్విట్టర్ అధికారుల ఇళ్లను తనిఖీ చేయలేదని..ఎవరిని కూడా జైలుకు పంపలేదన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం 2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది. ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీలో  లక్షల సంఖ్యలో అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. ఏడాది పాటు అంటే 2021 నవంబర్​ వరకు ఈ నిరసనలు కొనసాగాయి.  రైతులకు సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. రైతుల ఆందోళనతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను  ఉపసంహరించుకుంది.