
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంపదను 60 శాతం పడిపోయేలా చేసిన హిండెన్‌బర్గ్ మరో కంపెనీపై అలాంటి రిపోర్టునే రెడీ చేసినట్లు ప్రకటించింది. ఈసారి యూఎస్ కంపెనీ బ్లాక్ ఇంక్‌ను టార్గెట్ చేసింది. ఈ కంపెనీలో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నట్లు కూడా హిండెన్‌బర్గ్ గురువారం వెల్లడించింది. ట్విటర్ మాజీ ఫౌండర్ జాక్ డోర్సె ఈ పేమెంట్స్ కంపెనీ బ్లాక్ ఇంక్‌ను ఏర్పాటు చేశారు. యూజర్ల సంఖ్యను ఎక్కువ చేసి చూపించడంతో పాటు, కొత్త కస్టమర్లను చేజిక్కించుకునేందుకు చేస్తున్న ఖర్చునూ అధికం చేసి ఈ కంపెనీ చెబుతోందని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తోంది.
రెండేళ్ల పాటు బ్లాక్ ఇంక్‌పై ఇన్వెస్టిగేషన్ చేశామని, డెమొగ్రాఫిక్స్ను తనకు అనుకూలంగా మలుచుకుని ఈ కంపెనీ లాభపడుతోందని గుర్తించామని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఈ తాజా సమాచారాన్నంతటినీ తన వెబ్సైట్లో పెట్టింది హిండెన్‌బర్గ్. బ్లాక్ ఇంక్ అకౌంట్లలో 40 నుంచి 75 శాతం దాకా అకౌంట్లు ఫేక్ అకౌంట్లేనని ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు అంచనా వేసినట్లు హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఇందులో మోసం జరిగిందని, అదనపు అకౌంట్లను క్రియేట్ చేయడమో లేదా ఎక్కువ అకౌంట్లు ఒకే వ్యక్తికి చెందినవిగానో తెలుస్తోందని ఆరోపించింది.
బ్లాక్ ఇంక్ బిజినెస్‌లో పెద్ద ఇన్నోవేషన్ ఏమీ లేదని, కన్జూమర్లు, ప్రభుత్వాలను మోసం చేయడమేనని, చట్టాలకు చిక్కకుండా లోన్లను డ్రెస్ అప్ చేసిందని, దానినే రివల్యూషనరీ టెక్నాలజీగా కంపెనీ చెప్పుకుంటోందని విమర్శించింది. నెంబర్లను పెంచి చూపడం ద్వారా ఇన్వెస్టర్లను ఈ కంపెనీ మోసగించిందని హిండెన్‌బర్గ్ పేర్కొంది.
గత రెండేళ్లుగా రీసెర్చ్ చేసి..
బ్లాక్ ఇంక్‌పై రిపోర్టు తెచ్చేందుకు రెండేళ్ల కాలంలో డజన్ల కొద్దీ ఆ కంపెనీ పాత ఉద్యోగులు, పార్ట్నర్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్టులను ఇంటర్వ్యూలు చేశామని, రెగ్యులేటరీ, లిటిగేషన్ రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా స్టడీ చేశామని హిండెన్‌బర్గ్ తెలిపింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో బ్లాక్ఇంక్ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 18 శాతం పతనమయ్యాయి. ఐడెంటిటీ ఫ్రాడ్స్సహా పలు స్కామ్‌లకు ఈ కంపెనీ పాల్పడిందని, వచ్చిన డబ్బును వెంటనే చేజిక్కించుకుందని ఆరోపించింది.
యూజర్లు మోసం చేసినట్లు తేలిన సందర్భాలలో వారిని బ్లాక్ లిస్టులో మాత్రమే పెట్టేదని, వారి అకౌంట్లను బ్యాన్ చేసేది కాదని విమర్శించింది. ఇలాంటి అకౌంట్లను యాక్టివ్ యూజర్ల అకౌంట్లతో అసోసియేట్ చేసేదని, దానికి సంబంధించిన చాలా స్క్రీన్షాట్లను ఆ కంపెనీ మాజీ కస్టమర్ సర్వీస్ ఉద్యోగి ఒకరు తమకు ఇచ్చారని హిండెన్‌బర్గ్ వెల్లడించింది. ఒక పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించిన జాక్ డోర్సే 5 బిలియన్ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కూడబెట్టినట్లు ఆరోపించింది. డోర్సే, మరి కొంతమంది సీనియర్ ఉద్యోగులూ మహమ్మారి టైములోనే బ్లాక్ఇంక్ కంపెనీలో బిలియన్ డాలర్ల విలువైన షేర్లను తెగనమ్మారని తెలిపింది. తాము బాగుంటే చాలనే ఉద్దేశంతోనే వారు తమ షేర్లను అమ్మేసినట్లు పేర్కొంది.
ఓర్టెక్స్ డేటా ప్రకారం మార్చి 22 నాటికి బ్లాక్ ఇంక్ ఫ్రీ ఫ్లోట్ షేర్లలో సుమారు 5.2 శాతం దాకా షార్ట్ పొజిషన్లు ఉన్నట్లు తేలుతోంది. ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ రిసెర్చ్ సంస్థగా చెప్పుకుంటున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను 2017 లో నాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్స్ ప్రొడక్టులను హిండెన్‌బర్గ్ ఎనలైజ్ చేస్తుంది. తప్పులు చేసే కార్పొరేట్లను బయటపెట్టడమే కాకుండా, ఆ కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లనూ హిండెన్‌బర్గ్ తీసుకుంటోంది.