Twitter : ట్విట్టర్ లోగో మారిందా.. పిట్టపోయి కుక్క వస్తుందా..మస్క్ వ్యూహమేంటీ

Twitter : ట్విట్టర్ లోగో మారిందా.. పిట్టపోయి కుక్క వస్తుందా..మస్క్ వ్యూహమేంటీ

ట్విట్టర్.. ఈ పేరు వినగానే బ్లూ కలర్ లోని పిట్ట బొమ్మ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఇది నోటెడ్.. ఇప్పుడు ట్విట్టర్ తన లోగోను మార్చబోతున్నదా.. పిట్ట ప్లేస్ లో కుక్క వస్తుందా.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. దీనికి కారణం లేకపోలేదు.. ఏప్రిల్ 4వ తేదీ మంగళవారం ఉదయం నుంచి కొన్ని దేశాల్లో ట్విట్టర్ ఓపెన్ చేసిన వారికి కుక్క లోగో కనిపించింది. దీంతో ఇది పెద్ద చర్చకు దారి తీసింది. దీనికితోడు ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్.. తన ట్విట్టర్ లో కుక్కతో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నట్లు ఉన్న పాత ఫొటోను మళ్లీ ట్విట్ చేయటంతో.. దీనిపై అనుమనాలు బలపడుతున్నాయి. 

ట్విట్టర్ లోగోలో ఉన్న పిట్టను తీసేసి.. కుక్క పెడుతున్నట్లు వార్తల వెనక కారణాలు లేకపోలేదు. డాగీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీలో ఈ డాగీ సింబల్ ఉంటుంది. గతంలో డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ పెంచటంలో ఎలన్ మస్క్ కీలకంగా వ్యవహరించారని.. దాని విలువను 36 వేల శాతం పెరిగే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారని.. దీని ద్వారా ఎలన్ మస్క్ వందల కోట్లు సంపాదించారనే ప్రచారం ఉంది. అంతే కాకుండా క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్ కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ నిర్వహించారని ఆరోపిస్తూ.. ఎలన్ మాస్క్ పై 258 బిలియన్ డాలర్ల దావా కోర్టులో నడుస్తుంది. ఈ కేసు విచారణలో భాగంగా.. రాకెటీరింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలంటూ ఎలన్ మస్క్ అమెరికా కోర్టులో స్పెషల్ పిటీషన్ దాఖలు చేశారు. 

దీనిపై ఎలన్ మస్క్ లాయర్లు మాట్లాడుతూ.. ఈ పిటీషన్ దాఖలు చేసిన వారు.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వెల్లడించారు. మస్క్ ఎలాంటి మోసం చేశాడు.. ఎలా చేశారు.. దీని వల్ల జరిగిన నష్టం ఏంటీ అనే విషయంలో స్పష్టత ఇవ్వకపోగా.. వ్యాజ్యం దాఖలు చేసిన వారి దగ్గర ఆధారాలు లేవని స్పష్టం చేశారు మస్క్ తరపు లాయర్లు.  

అమెరికాలో కోర్టులో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే.. ట్విట్టర్ లోగోను కుక్కగా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలతో.. దాని విలువ భారీగా పెరిగింది. దాదాపు డాలర్ ను టచ్ చేసింది. నెల రోజుల్లో పెరగాల్సిన విలువ.. ఒకే ఒక్క ట్విట్ తో పెరగటం విశేషం.

కోర్టులో ఎలన్ మస్క్ కేసులు ఎలా ఉన్నా.. ట్విట్టర్ లోగో మారుస్తున్నట్లు.. పిట్ట పోయి కుక్క వస్తున్నట్లు వచ్చిన వార్తలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. చూడాలి.. అధికారికంగా దీనిపై ప్రకటన వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.