మెడికల్ కోడింగ్ పేరుతో కుచ్చుటోపీ.. ట్రైనింగ్ ప్లస్ జాబ్ అంటూ రూ.లక్షల్లో వసూల్

మెడికల్ కోడింగ్ పేరుతో కుచ్చుటోపీ..   ట్రైనింగ్ ప్లస్ జాబ్ అంటూ రూ.లక్షల్లో వసూల్
  • 50 మంది నిరుద్యోగులను నట్టేట ముంచిన ఇద్దరు
  • కంపెనీ సీఈవోకు  తెలియకుండా మోసం

మాదాపూర్, వెలుగు: మెడికల్ కోడింగ్ ట్రైనింగ్​తోపాటు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి 50 మంది నిరుద్యోగులను ఇద్దరు నట్టేట ముంచారు. కంపెనీ సీఈవోకు తెలియకుండా అందులోనే పనిచేస్తూ పక్కా ప్లాన్ ప్రకారం భారీ మోసానికి తెరతీశారు. మాదాపూర్​లో​జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొండాపూర్​లో మైండ్ స్పార్క్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, మాదాపూర్ లో ప్రిడెక్స్ పేరిట దిలీప్​కుమార్ అనే వ్యక్తి రెండు మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థలను నిర్వహిస్తున్నాడు. ఇదే సంస్థలో శ్రీకాంత్ జోషి లెక్చరర్ గా, శివారెడ్డి మేనేజర్​గా ఉద్యోగాలు చేస్తున్నారు. 

కరీంనగర్, సిద్దిపేటతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది విద్యార్థులు ఆన్​లైన్​లో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ (సీపీసీ) కోర్సులో శిక్షణ కోసం రూ.15 వేల చొప్పున చెల్లించారు. ఆరు నెలల శిక్షణ అనంతరం విద్యార్థులకు సీపీసీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుందని, పరీక్ష రాసిన తర్వాత మెడికల్ కోడింగ్‌‌కు సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగం ఇప్పిస్తామని శ్రీకాంత్ జోషి విద్యార్థులను నమ్మించాడు. తాను ఏఏపీసీ సర్టిఫైడ్ మెంబర్ ని అని నమ్మించి, ఉద్యోగం కోసం ఒక్కో విద్యార్థి నుంచి పరీక్ష ఫీజుతోపాటు, ఉద్యోగం కోసమంటూ రూ. లక్ష వరకు వసూలు చేశాడు. 

నవంబర్ 30న ఏఏపీసీ పరీక్ష ఉంటుందని, నగరంలోని అమీర్​పేట, గచ్చిబౌలిలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని చెప్పాడు. పరీక్షకు హాల్ టికెట్లను నవంబర్ 29న జారీ చేస్తానని చెప్పడంతో ఆయా జిల్లాల నుంచి విద్యార్థులు 29న నగరానికి వచ్చి శ్రీకాంత్ జోషికి ఫోన్ చేశారు. అతని ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కోచింగ్ సెంటర్ మేనేజర్ శివారెడ్డికి చేశారు. అతను కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో  విద్యార్థులందరూ 30న మాదాపూర్​లో ఉన్న ప్రిడెక్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీకాంత్, శివారెడ్డి ఆఫీస్ లో లేకపోవడంతో సంస్థ సీఈవో దిలీప్​కుమార్​ను కలిసి జరిగిన విషయం చెప్పారు. 

అయితే వారిద్దరూ డబ్బులు వసూలు చేసిన విషయం తన దృష్టికి రాలేదని సీఈవో చెప్పడంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు.. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తమ వద్ద మొత్తం రూ.47 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం శివారెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ జోషి పరారీలో ఉన్నాడు. ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వకూడని మాదాపూర్ పోలీసులు తెలిపారు.