స్నానానికి వెళ్లి ఇద్దరు బాలురు మృతి ..ఆసిఫాబాద్‌‌ జిల్లా కేంద్రంలో ఒకరు, కాగజ్‌‌నగర్‌‌లో మరొకరు.

స్నానానికి వెళ్లి ఇద్దరు బాలురు మృతి ..ఆసిఫాబాద్‌‌ జిల్లా కేంద్రంలో ఒకరు, కాగజ్‌‌నగర్‌‌లో మరొకరు.

ఆసిఫాబాద్/కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోగా.. మరో యువకుడిని ట్రాక్టర్‌‌ డ్రైవర్‌‌ కాపాడాడు. ఆసిఫాబాద్‌‌ జిల్లాలోని జైనూర్‌‌, కాగజ్‌‌నగర్‌‌ మండలాల్లో ఈ ఘటనలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే...

జైనూరు మండలం పాట్నాపూర్‌‌ గ్రామానికి మహబూబ్‌‌ (17) ఆసిఫాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని రాజంపేటలో ఉండే బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం మహబూబ్‌‌తో పాటు అతడి బంధువుల పిల్లలైన రేహాన్‌‌, ఆయాన్‌‌ కలిసి సమీపంలోని పెద్దవాగులో స్నానానికి వెళ్లారు. వాగులోకి దిగిన మహబూబ్‌‌ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా.. అతడిని కాపాడేందుకు రేహాన్‌‌ సైతం నీటిలోకి దిగాడు. 

ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. వీరిని గమనించిన ఓ ట్రాక్టర్‌‌ డ్రైవర్‌‌ వెంటనే వాగులోకి దిగి రేహాన్‌‌ను కాపాడగా.. మహబూబ్‌‌ గల్లంతయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంథో సీఐ బాలాజీ వరప్రసాద్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం గజ ఈతగాళ్లను పిలిపించి వాగులో గాలించగా.. ఘటనాస్థలం నుంచి వంద మీటర్ల దూరంలో మహబూబ్‌‌ డెడ్‌‌బాడీ దొరికింది. 

కోస్గి డ్యామ్‌‌లో టెన్త్‌‌ స్టూడెంట్‌‌..

ఫ్రెండ్స్‌‌తో కలిసి స్నానం చేసేందుకు కోస్గి డ్యామ్‌‌ వద్దకు వెళ్లిన ఓ టెన్త్‌‌ స్టూడెంట్‌‌ నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన కాగజ్‌‌నగర్‌‌  మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కాగజ్‌‌నగర్‌‌ పట్టణంలోని బాలాజీనగర్‌‌కు చెందిన అంకిత్‌‌ రాథోడ్‌‌ (15) మరో ఇద్దరు ఫ్రెండ్స్‌‌తో కలిసి స్నానం చేసేందుకు కోస్గి రిజర్వాయర్‌‌ వద్దకు వెళ్లాడు. 

నీటిలోకి దిగగా.. లోతు ఎక్కువగా ఉండడంతో అంకిత్‌‌ మునిగి గల్లంతయ్యాడు. గమనించిన అతడి ఫ్రెండ్స్‌‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చేపట్టగా.. అంకిత్‌‌ డెడ్‌‌బాడీ దొరికింది.