కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మందపాడులో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఇంటి సమీపంలో ఉన్న చెరువు దగ్గర సెల్ఫీ తీసుకుందామని వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృత్యవాత పడ్డారు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో అన్న హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడటంతో అన్నయ్యని కాపాడటానికి తమ్ముడు ప్రేమ్ కూడా చెరువు లోకి దూకేశాడు. తన అన్నయ్యని రక్షించే ప్రయత్నంలో ఇరువురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, పోలీసులు.. చెరువులో నుండి అన్నదమ్ముల మృతదేహాలను బయటకు తీసి కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ నిమిత్తం గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. చేతికి అంది వచ్చిన కుమారులు ఇద్దరు మృతి చెందటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

