బెల్లంపల్లి, వెలుగు : పులి దాడిలో రెండు పశువులు చనిపోయాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం బుగ్గగూడెం, దేవాపూర్ శివారులోని ఎగండి అటవీ ప్రాంతంలో జరిగింది. బుగ్గగూడెం గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్కకు చెందిన ఆవును బుగ్గగూడెం రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులో పులి దాడి చేసి చంపేసింది.
అలాగే దేవాపూర్ శివారులో కూడా మరో పశువును పులి చంపింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం ధ్రువీకరించారు. కర్షలఘటం, పల్లంగూడ, వరిపేట, బుగ్గగూడెం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. పత్తి చేన్లలోకి వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పశువులు మృతి చెందిన ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌వో పూర్ణచందర్ చెప్పారు.
