కష్టాలను అధిగమించి ర్యాంకర్లుగా నిలిచారు

కష్టాలను అధిగమించి ర్యాంకర్లుగా నిలిచారు

రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఆ  తల్లిదండ్రులది. ఆ కష్టం తమ పిల్లలకి వద్దనుకున్నారు వాళ్లు . ఉన్నంతలో  పిల్లల్ని గొప్పగా చదివించాలనుకున్నారు. వాళ్లని పెద్ద ఆఫీసర్లుగా చూడాలనుకున్నారు. వాళ్ల ఆశలకి హైదరాబాద్,​ బాగ్​ లింగంపల్లిలోని డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ విద్యాసంస్థలు అండగా నిలిచాయి. దాంతో ఆ పేదింటి పిల్లలు ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్​​  స్టేట్​ ర్యాంకర్​లు అయ్యారు. తల్లిదండ్రులు, చదువు చెప్పిన టీచర్ల నమ్మకాన్ని నిలబెడతామని చెప్తున్న వాళ్ల పేర్లు సాయినాథ్​, ధీరజ్​, రమ్య, గాయత్రి.. వాళ్ల సక్సెస్​ స్టోరీ ఇది. 

లక్ష్యం పెట్టుకుని చదివితే.. విజయం వెంటే నడిచొస్తుందని నిరూపించిన ఈ నలుగురిలో..  ఎంపీసీలో సాయినాథ్​  466, ధీరజ్​ 465 మార్కులు తెచ్చుకున్నారు. స్టెతస్కోప్​ కలతో బైపీసీలో చేరిన  రమ్యకి 426, గాయత్రికి 417 మార్కులు వచ్చాయి.  అయితే  వీళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.  ఆ కథల్లో అంతా పేదరికమే ఉంది. దాన్నుంచి బయటపడటానికి ముందుముందు ఇంకా కష్టపడి చదువుతామంటున్న ఈ ర్యాంకర్స్​ గురించి  వాళ్ల మాటల్లోనే..

అన్ని సదుపాయాలున్నాయి

మా నాన్న హరి డి.సి.ఎం​ నడుపుతాడు.  అమ్మ ఇండ్లలో పనిచేస్తుంది. ఆ అరకొర సంపాదనతో నన్ను, ఇద్దరు అక్కల్ని చదివిస్తున్నారు అమ్మానాన్న. చాలాసార్లు ఇబ్బంది అయింది..అయినా సరే నాన్న చదువు మాన్పించలేదు. ఇంటర్మీడియెట్​కి​ చాలా కాలేజీల్లో లక్షల్లో ఫీజులున్నాయి. అంత స్థోమత లేకపోవడంతో..  అంబేద్కర్​ కాలేజీలో చేరా. ఇక్కడ తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్​ ఇస్తున్నారు. పైగా అన్ని సదుపాయాలు​ ఉన్నాయి. అందుకే బైపీసీలో 440కి 426 మార్కులు వచ్చాయి. దీనంతటికి క్రెడిట్​ మా టీచర్లకే దక్కుతుంది. మా పేరెంట్స్​, రిలేటివ్స్​ అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. కార్డియాలజిస్ట్​ అవ్వాలనుకుంటున్నా.
- టి. రమ్య,  అంబర్​పేట్

కాలేజీ పేరు గర్వంగా చెప్తా

నాన్న మమ్మల్ని పట్టించుకోడు. దాంతో నాతో పాటు తమ్ముడి బాధ్యత అమ్మపై పడింది. మా పోషణ కోసం  ఓ ప్రైవేట్​ బ్యాంక్​లో రోజుకి  మూడొందల రూపాయలకి పనిచేస్తోంది అమ్మ.  చాలీచాలని జీతంతోనే టెన్త్​ వరకు ఇద్దర్నీ ప్రైవేట్​ స్కూల్​లో చదివించింది. అప్పోసొప్పో చేసి ఇంటర్మీడియెట్​కి​  నన్ను ప్రైవేట్​లోనే చేర్పించాలనుకుంది. కానీ, నాకది ఇష్టం లేదు. అమ్మకి నా చదువు భారం కాకూడదని, తక్కువ ఫీజున్న కాలేజీ కోసం వెతికా. అంబేద్కర్​ కాలేజీలో చదువు బాగా చెప్తారని తెలిసి జాయిన్​ అయ్యా. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి లెక్చరర్స్​ సపోర్ట్​ చేశారు. మెటీరియల్స్​ అందించారు. లెక్చరర్స్​ చెప్పినట్టు చదువుకోవడం వల్ల బైపీసీ లో417 మార్కులు వచ్చాయి. నేను అంబేద్కర్​ కాలేజీ స్టూడెంట్​ని అని గర్వంగా చెప్పుకుంటా. 
- ఎన్​. గాయత్రి, బాగ్​ లింగంపల్లి

పెద్ద ఇంజినీర్​ అవుతా

డబ్బు లేక ఏడో తరగతితోనే చదువు ఆపేశాడు మా నాన్న రాము. ఆటో నడుపుతూ మమ్మల్ని పోషిస్తున్నాడు. చదువు విలువ తెలుసు కాబట్టి.. అన్నని, నన్ను బాగా చదివించాలనుకున్నాడు.  నేను చిన్నప్పట్నించీ చదువులో ముందుండేవాడ్ని. పదో క్లాస్​లో పదికి పది పాయింట్స్​ తెచ్చుకున్నా. ఇంటర్మీడియెట్​​  చదువుకు తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఎడ్యుకేషన్​ ఇచ్చే కాలేజీ కోసం సెర్చ్​ చేశా. చాలామంది అంబేద్కర్​ కాలేజీ బాగుంటుందని చెప్పడంతో  చేరా. ఫ్యాకల్టీ సపోర్ట్​తో...నాకు నేను ఒక టైం టేబుల్ వేసుకున్నా. నా కష్టానికి తగ్గట్టే 470కి 466 మార్కులు వచ్చాయి. అమ్మానాన్నలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంజినీర్​ అవ్వాలన్నది నా కల. దానికోసం ఇప్పట్నించే హార్డ్​వర్క్​ చేస్తున్నా.
 –టి. సాయినాథ్​, జియాగూడ

అమ్మ కష్టాలన్నీ తీర్చుతా

నాకు పదకొండేండ్లు ఉన్నప్పుడు నాన్న చని పోయాడు. అప్పట్నించి అమ్మ మంగ ఇండ్లలో పనిచేసి నన్ను, తమ్ముడ్ని చూసుకుంటోంది. నెలంతా  కష్టపడితే అమ్మకి వచ్చేది 6 వేలే. వాటిల్లోనే ఇంటి కిరాయి, మా రోజువారీ  అవసరాలన్నీ వెళ్లదీయాలి. అందుకే నేను ఏ రోజూ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. గవర్నమెంట్​ స్కూల్​లో చదివి టెన్త్​ క్లాస్​లో  పది పాయింట్లు తెచ్చుకున్నా.  దాంతో మా స్కూల్​ ​ టీచర్​ నా ఇంటర్​ కాలేజీ ఫీజు కడతానంది. సాయం చేస్తున్నారు కదా అని పెద్ద కాలేజీల్లో చేరడం కరెక్ట్​ అనిపించలేదు.. వీలైనంత తక్కువ ఖర్చుతో మంచిగ చదువుకోవాలని అంబేద్కర్​ కాలేజీలో చేరా. ఇక్కడ టీచర్లు, మేనేజ్​మెంట్​ సపోర్ట్​ చూశాక..  బెస్ట్​ కాలేజీని ఎంచుకున్నానని అర్థమైంది. బాగా చదువుకుని అమ్మ కష్టాలన్నీ తీర్చాలనుకుంటున్నా.
- ధీరజ్, రామాంతపూర్​