మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నగరంలోని మయూరి పార్క్ అభివృద్ధి, సుందరీకరణకు నగర్వన్ యోజన కింద మంజూరైన రూ.2 కోట్లతో పనులు జరుగుతున్నాయని పీసీసీఎఫ్ సి.సువర్ణ తెలిపారు. ఆదివారం మయూరి పార్క్, పిల్లలమర్రిని ఆమె సందర్శించి మొక్కను నాటారు. నగర్వన్ పథకం కింద రూ.70 లక్షలతో పూర్తి చేసిన 15 కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్,11 సైకిళ్లు, పిల్లల ఆటల పరికరాలు, టైగర్ ఫొటో పాయింట్ పునరుద్ధరణ, రిపేర్లు, బటర్ ఫ్లై, కరెన్సీ పార్క్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఆమె ప్రారంభించారు.
నగర్ వన్ చేపట్టిన పనులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆమె తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. పిల్లలమర్రిలోని డీర్ పార్క్, మినీ జూపార్క్ ను పరిశీలించారు. పక్షులు, జంతువులను ఆసక్తిగా తిలకించారు. రాజరాజేశ్వరి ఆలయం, మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలో సేకరించిన పురాతన విగ్రహాలు, నాణేలు, వస్తువులు, సామగ్రిని పరిశీలించారు.కన్జర్వేటర్ శివాల రాంబాబు, డీఎఫ్వో ఎస్.సత్యనారాయణ, ఎఫ్ఆర్వో ఎండీ అబ్దుల్ హై పాల్గొన్నారు.
