- కృష్ణానది చెంతనే ఉన్నా.. పాలమూరు వలసల జిల్లాగా మారడం బాధాకరం
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి
మరికల్, వెలుగు: దేశంలోని పలు రాష్ట్రాల్లో వలస బతుకులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా మరికల్లో ‘వలస బతుకు- నర్సన్న’ పుస్తకాన్ని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరుజిల్లా పక్క నుంచే కృష్ణా నది పారుతున్నా ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు.
కరువు కాటకాలతో ఆందోళనకర పరిస్థితిలో ఇక్కడి ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల నుంచి ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నా పాలమూరుప్రాంత ప్రజలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి వారు వలస వెళ్లిన ప్రాంతాల్లో గుడిసెల పక్కనే ఉన్న మురుగు నీటిని తాగి దుర్బరమైన జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. వీరి బతుకులపై ఎవరూ చర్చించడం లేదని, కనీసం ఆలోచన చేయడం లేదన్నారు.
నర్సన్న రాసిన పుస్తకాన్ని చదివితే మనసు కలచి వేసిందన్నారు. ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో వలస బతుకులపై తీవ్రంగా చర్చ జరుగుతోందన్నారు. పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ వలస బతుకులపై నర్సన్న రాసిన పుస్తకాన్ని నాలుగు రోజులు చదివి బిహార్ రాష్ట్రానికి వెళ్లానని, అక్కడ నర్సన్న అనుభవాలు కండ్లకు కట్టినట్టు కనిపించాయని తెలిపారు. ఉన్నది ఉన్నట్లుగా రాశారని కొనియాడారు. దేశంలోని సమస్యలను ఎత్తి చూపేలా పుస్తకం ఉందన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ నర్సన్న రాసిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవి, ఈ విషయంపై చర్చించాల్సిన అవసరముందన్నారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పుస్తక రూపంలో రాయడం అభినందనీయమని కొనియాడారు. పాలమూరు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్తారని, దీనిని ఏ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ పాలమూరు జిల్లా కళాకారులకు నిలయమని తెలిపారు. డీజీ హైమావతి, పాలమూరు అధ్యయన వేదిక కమిటీ సభ్యులు ఎం.రాఘవచారి, ఎం.వెంకట్రాములు, ఎం.సుదర్శన్ పాల్గొన్నారు.
