9 రోజుల తేడాతో భార్యాభర్తలు మృతి..అనాథలైన ఇద్దరు చిన్నారులు

9 రోజుల తేడాతో భార్యాభర్తలు మృతి..అనాథలైన ఇద్దరు చిన్నారులు

నర్వ, వెలుగు: బిడ్డ పుట్టి ఒక్కరోజు కూడా కాకుండానే భర్తను కోల్పోయింది. భర్త మృతిని జీర్ణించుకోలేక 9వ రోజున ఆమె సైతం మృతిచెందింది. దాంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మెట్ల పులిమేటి రాజు(40), శేషమ్మ(34) దంపతులకు కొడుకు నాని(10) ఉన్నాడు. రాజు భార్యాబిడ్డతో కలిసి హైదరాబాద్​లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కరోనా ప్రభావంతో గ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కొంతకాలం క్రితం రాజుకు కాళ్లవాపు వచ్చింది. పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తగ్గలేదు. పది రోజుల కిందట రెండో కాన్పు కోసం శేషమ్మను ఆస్పత్రిలో చేర్పించారు. బిడ్డ పుట్టాడు. భార్యకు డెలివరీ అయిన మరుసటి రోజే రాజు మృతిచెందాడు. శనివారం భర్త 9వ రోజు కార్యక్రమం ఉంది. భర్త చనిపోయినప్పటి నుంచి విషాదంలో మునిగిపోయిన శేషమ్మ శనివారం మృతి చెందింది. పది రోజుల వయస్సున్న తమ్ముడిని ఒడిలో పెట్టుకుని నాని తల్లి మృతదేహం దగ్గర రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.