ఒక్కో బెడ్‌‌‌‌‌‌‌‌పై ఇద్దరు కరోనా పేషెంట్లు

ఒక్కో బెడ్‌‌‌‌‌‌‌‌పై ఇద్దరు కరోనా పేషెంట్లు
  • నాగ్​పూర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సాలని బెడ్లు..  సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

నాగ్​పూర్:  కరోనా సోకిందంటే.. ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచుతరు. అతని దగ్గరికి ఎవర్నీ పోనియ్యరు. డాక్టర్లు కూడా పీపీఈ కిట్లు వేసుకొని ట్రీట్ మెంట్ ఇస్తరు. బాధితుడి నుంచి వైరస్ మరెవరికీ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటరు. కానీ నాగ్ పూర్ లోని ఓ ఆస్పత్రిలో మాత్రం  ఇద్దరు కరోనా పేషెంట్లను ఒకే బెడ్ పై ఉంచిన్రు. హాస్పిటల్ కు వైరస్ బాధితుల తాకిడి పెరగడంతో అక్కడ బెడ్లు సాలక ఇట్ల చేసిన్రట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్​లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయట కు రావడంతో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న పరిస్థితికి ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి. ‘‘ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. బెడ్లను పెంచి, ఒక్క బెడ్​ను ఒక్క పేషెంట్​కే ఇచ్చినం. మాపై వర్క్​లోడ్ చాలా ఎక్కువగా ఉంది” అని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అవినాశ్ గవాండే చెప్పారు. ప్రైవేట్​లో ఖర్చు ఎక్కువవుతుందని బాధితులు గవర్నమెంట్ హాస్పిటళ్లకే వస్తున్నారని, సీరియస్ కేసులను డాక్టర్లు ఇక్కడికే రిఫర్ చేస్తున్నారని.. దీంతో సర్కార్ దవాఖాన్లకు పేషెంట్ల తాకిడి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ‘నాగ్​పూర్​లో బెడ్లు సాల్తలేవ్. ఒకే బెడ్​పై ఇద్దరు కరోనా పేషెంట్లను ఉంచితే, వాళ్లకు వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ కుంభకర్ణుడిలా నిద్రపోతోంది. నాగ్​పూర్ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, ఒక్కరూ సిటీ లో లేరు. వాళ్లు వేరే ఎక్కడో బిజీగా ఉన్నారు’ అని బీజేపీ లీడర్ చంద్రకాంత్ మండిపడ్డారు.
 

ఉరేసుకున్న కరోనా పేషెంట్.. 
కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగ్​పూర్​లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీ)లో సోమవారం జరిగిం ది. హాస్పిటల్​లో అడ్మిట్ అయిన 81 ఏండ్ల పెద్దాయన ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్నాడని జీఎంసీ ఇన్ చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాంచన్ వాంఖడే చెప్పారు.