వేధింపుల కారణంగానే..ఇద్దరు ఉద్యోగులు మృతి

వేధింపుల కారణంగానే..ఇద్దరు ఉద్యోగులు మృతి
  •     వారం రోజుల వ్యవధిలోని రెండు ఘటనలు
  •      హెచ్​సీయూ మేనేజ్​మెంట్​పై స్టూడెంట్లు, సిబ్బంది ఆగ్రహం
  •      మెయిన్ గేటు ముందు ప్లకార్డులతో నిరసన

గచ్చిబౌలి, వెలుగు:  గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు వారం రోజుల వ్యవధిలో చనిపోయారు. వీరి మృతికి హెచ్​సీయూ మేనేజ్​మెంట్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ యూనివర్సిటీ స్టూడెంట్స్, సిబ్బంది మెయిన్ గేటు వద్ద ప్లకార్డులు పట్టుకుని బుధవారం ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ డిపార్ట్​మెంట్​లో పనిచేసే వినోద్ ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు. ఆ డిపార్ట్​మెంట్ హెడ్ అలోక్ పాండే వేధింపుల కారణంగానే వినోద్​కు హార్ట్ ఎటాక్ వచ్చిందని స్టూడెంట్లు, సిబ్బంది ఆరోపించారు. పని చేసే టైమ్​లో ఛాతిలో నొప్పి వస్తున్నదని వినోద్ చెప్పినా.. అలోక్ పాండే పట్టించుకోలేదన్నారు. డాక్టర్ల సలహా లేకుండా వినోద్​కు పాండే ఏదో టాబ్లెట్ ఇచ్చాడని మండిపడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన వినోద్​ను హాస్పిటల్​కు తరలించడంలో కూడా అలోక్ పాండే నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హెచ్​సీయూ మేనేజ్​మెంట్ కూడా కనీసం కమిటీ వేసి ఎంక్వైరీ చేయలేదన్నారు. అలోక్ పాండేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్ వాళ్లే కాపాడుతున్నారని ఆరోపించారు.

 మరో ఘటనలో శానిటేషన్ డిపార్ట్​మెంట్​లో పనిచేసే ప్రవీణ్.. వర్క్ ప్లేస్​లోనే పురుగుల మందు తాగి, హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయాడని తెలిపారు. అతన్ని కూడా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు వేధింపుల గురించి ప్రతి కార్మికుడు బహిరంగంగా చెప్తున్నా.. ఎవరూ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని స్టూడెంట్లు మండిపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మల్లేశ్ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడని, కార్మికులను అన్ని రకాలుగా దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్​మెంట్ మల్లేశ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మృతి చెందిన వినోద్, ప్రవీణ్ కుటుంబాలను వర్సిటీ మేనేజ్​మెంట్ ఆదుకోవాలని, వేధింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.