తెలుగు బిగ్ బాస్ : కోపంతో కంటెస్టెంట్స్ని వణికించిన నాగ్

తెలుగు బిగ్ బాస్ : కోపంతో కంటెస్టెంట్స్ని వణికించిన నాగ్

వారమంతా ఒకెత్తు. వీకెండ్ ఎపిసోడ్ ఒకెత్తు. బిగ్‌బాస్ చూసే ప్రతి ప్రేక్షకుడూ వీకెండ్ ఎప్పుడు వస్తుందా, నాగార్జున వచ్చి ఏం మాట్లాడాతారా అని అత్యంత ఆసక్తితో వెయిట్ చేస్తుంటారు. ఈసారీ అలాగే చూశారు. వారం గిర్రున తిరిగింది. ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. మరి నాగార్జున ఈసారి ఏం మాట్లాడారు? హౌస్‌మేట్స్ పర్‌‌ఫార్మెన్సెస్‌ పట్ల ఎలా రియాక్టయ్యారు? 

కొంచెం కూల్.. కొంచెం హాట్

ముందుగా నాగ్ అందరి ఆట గురించీ ప్రశ్నించి వాళ్ల తప్పుల్ని కరెక్ట్ చేశారు. ఒప్పుల్ని ప్రశంసించారు. మొదట ఫైమాని.. నువ్వు గెలవడానికి ఆడతావా, అవతలివాళ్లు గెలవకూడదని ఆడతావా, రేవంత్‌ని ఎందుకలా చేశావ్ అంటూ గట్టిగా ప్రశ్నించారు. తన స్ట్రాటజీ కరెక్ట్ కాదని తేల్చేశారు. అలా ఆడినా రేవంత్ నీకోసం ఆడి నిన్ను గెలిపించాడు, అయినా నువ్వు తనని అర్థం చేసుకోలేదు అంటూ క్లాస్ తీసుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ ఎంత ఇంపార్టెంటో తెలిసి కూడా సూర్య అడగ్గానే రాజ్‌ని గెలిపించడానికి ఎలా ఒప్పుకుంటావ్ అంటూ చంటిని అడిగారు. ‘కంటెండర్‌‌’ అంటూ చంటిని ఇమిటేట్ చేసి మరీ అతని తప్పును ఎత్తు చూపారు. నవ్వించడం బాగుంది కానీ నీ ఆట బాలేదని చెప్పేశారు. బయట చాలా పనులు చేస్తూ అలసిపోయి ఇక్కడ చిల్ అవడానికి వచ్చావా అంటూ సూర్యని క్వశ్చన్ చేసిన నాగ్.. వండి పెట్టినంత మాత్రాన మార్కులు పడవు, ఆట ఆడాలి, నీ అవకాశం పోగొట్టుకుని రాజ్‌ని ఎలా కెప్టెన్‌ని చేస్తావ్, ఒక్కసారి అవకాశం పోతే మళ్లీ రాదని గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రేవంత్‌ని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్‌‌ఎస్ అంటే ఏంటని అడిగారు. అతను జవాబులు చెప్పాక, అయితే నువ్వు ఐసీఎస్ అన్నారు. అంటే నువ్వు ఇండియన్ కరెక్షనల్ సర్వీసెస్‌లా తయారయ్యావ్, అందరినీ కరెక్ట్ చేయడానికి నువ్వేమైనా తోపువా, ఆడపిల్లలు ఎలా ఉండాలో మనుషులు ఎలా ఉండాలో నువ్వెందుకు చెబుతావ్ అంటూ కడిగేశారు. అందరినీ దగ్గరకు చేసుకోడానికి వచ్చావ్, దూరం చేసుకోకు అని హితవు చెప్పారు. ఆ తర్వాత ఆడియెన్స్ అడిగి మరీ ఆటను ఇరగదీశావ్ అంటూ రేవంత్‌ని మెచ్చుకున్నారు కూడా. నిన్ను ఓడించిన వ్యక్తి కోసం ఆడి తనని గెలిపించడం నచ్చిందంటూ కాంప్లిమెంట్స్ కురిపించారు. తర్వాత.. స్పోర్ట్స్ గురించి బాగా తెలిసి కూడా దెబ్బ తగిలిందని వెనకడుగు వేయడం కరెక్ట్ కాదు అని నేహకి చెప్పారు. ఎంతసేపూ రేవంత్ అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పడం మానేసి నీ ఆట మీద దృష్టి పెట్టు అంటూ అర్జున్‌ని హెచ్చరించారు. ఆట వేరు, బాండింగ్ వేరు, అర్జున్‌ని బైటికి పంపడానికి వాడిన బ్రెయిన్ మిగతాసార్లు ఎందుకు వాడవు అని ఆరోహిని అడిగారు. నువ్వు చేసి కూడా రేవంత్ దాని గురించి మాట్లాడితే ఎందుకు కోప్పడ్డావ్ అని కూడా అడిగారు. అనవసరమైన కోపం వద్దని చెప్పారు. 

ఇక గీతూనైతే ఏమీ అనకుండా ముందు క్లాప్స్ కొట్టారు. వందకి రెండొందల శాతం బెస్ట్ ఇచ్చావంటూ మెచ్చుకున్నారు. అయితే తాడిని తన్నేవాడుంటే దాని తలను తన్నేవాడు కూడా ఉంటాడని గుర్తు పెట్టుకో అంటూ ఆమె ఓడిపోవడం గురించి జోక్ చేశారు. పిల్లల్ని గిచ్చొద్దు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఆటలోకి వచ్చావు, బాగా ఆడావు కానీ మనుషుల సపోర్ట్ గురించి బాధపడొద్దు అని ఇనయాని ఎంకరేజ్ చేశారు. ఇక రాజ్‌నైతే తప్పుడు దారిలో కెప్టెన్‌వి అయ్యావు అని సూటిగా అనేశారు. అందరినీ అడుక్కుని, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి కెప్టెన్ అవ్వడం కరెక్ట్ కాదన్నారు. గెలుపును అడుక్కోకూడదని, సాధించాలని, కెప్టెన్‌గా ఏం ప్రూవ్ చేసుకుంటావో చూస్తానని అన్నారు నాగ్. ఆ తర్వాత ఆదిరెడ్డిని ప్రశ్నించిన నాగ్.. నువ్వు ఆట మధ్యలో కూడా ఆగి అవతలివాళ్లని రివ్యూ చేస్తున్నావ్, అది మానేస్తే నీ ఆట మెరుగవుతుంది అని సూచించారు. 

అన్నీ అడిగారు.. అందరినీ కడిగారు

నిజానికి పైన చెప్పుకున్న వాళ్లందరినీ ప్రశ్నించే ముందు నాగ్ ఓ పని చేశారు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా – రోహిత్, అభినయశ్రీ, కీర్తి, శ్రీహాన్.. వీళ్లందరినీ వెళ్లి సోఫా వెనకాల నుంచోమన్నారు. మీ ఆట తీరు గురించి నేనో విషయం చెబుతానంటూ పక్కనే ఉన్న కుండని కోపంగా పగలగొట్టారు. మిగతా వారందరితో మాట్లాడటం పూర్తయ్యాక వీళ్ల దగ్గరకు వచ్చారు. వాళ్ల గురించి మాట్లాడానికి ఏదో ఒకటి ఉంది, మీ గురించి అది కూడా లేదు అంటూ ఫైర్‌‌ అవడం స్టార్ట్ చేశారు. ముందుగా వాళ్ల బ్యాగ్స్ అన్నింటినీ ప్యాక్ చేసి స్టోర్ రూమ్‌లో పెట్టేయమన్నారు. ఆ తర్వాత మీ అందరి ఆట చెత్తగా ఉంది, అసలు మీరంతా ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న కుండల్లో ఒక్కోదాన్నీ పగులగొడుతూ, దానిపై ఎవరి ఫొటో ఉందో వాళ్లని నిలదీయడం స్టార్ట్ చేశారు. స్పిరిట్‌ని గేటు దగ్గరే వదిలేసి లోపలికి వచ్చావా, వచ్చిన అవకాశాన్ని వాడుకోవా అంటూ కీర్తిని.. మంచోడనిపించుకోడానికి వచ్చావా, నువ్వు ఆడకపోగా అందరి ఆటనీ చెడగొడుతున్నావ్ అంటూ బాలాదిత్యని.. తిండి మీద ఉన్న శ్రద్ధ ఆట మీద లేదు, బొమ్మ లాక్కుంటే ఫీలవ్వలేదు అదే ప్లేట్ లాక్కుని ఉంటే ఫీలయ్యేదానివి అంటూ శ్రీ సత్యని.. అద్దంలో చూసుకుంటూ ఉంటావా ఆట కూడా ఆడతావా, నువ్వు ఆడింది ఫెయిర్ గేమ్ కాదు అంటూ శ్రీహాన్‌ని.. ఇలాగేనా ఆడేది అంటూ రోహిత్‌ని, రొమాన్స్ చేయకపోతే కంప్లయింట్ చేసిన నువ్వు ఆట ఆడకపోతే చేయవా అంటూ మెరీనాని.. నీ సెకెండ్ ఇన్నింగ్స్ ఇంత డల్‌గా ఉంటుందా, నీ బొమ్మ తీసుకెళ్తున్నా చూసుకోవా అంటూ అభినయశ్రీని.. వంట చేసి పెడితే గెలిచేస్తావా, ఆట ఆడాల్సిన అవసరం లేదా అంటూ సుదీపని.. ఊరికే టైమ్‌పాస్ చేయడానికి షోకి వచ్చావా, ఇకపైనా ఆడకపోతే నువ్వు వేస్ట్ అంటూ షానీని.. చక్కగా తయారవుతావు తప్ప నీ దగ్గర వేరే మంచి పాయింటే లేదని వాసంతిని చాలా గట్టిగా వేసుకున్నారు నాగ్. 

బహుశా బిగ్‌బాస్‌కి హోస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాగ్ ఈ రేంజ్‌లో ఫైర్ అవ్వడం ఇదే మొదటిసారి కావచ్చు. పరుష పదాలను వాడటంలో కానీ.. తప్పుల్ని ఎత్తి చూడంలో కానీ ఏమాత్రం మొహమాటపడలేదు. అనాలనుకున్నది అనేశారు. మొత్తంగా అందరినీ కడిగిపారేశారు.

ఎవరు బాగా వేస్ట్?

అసలే ఎలిమినేషన్ అంటే భయపడే హౌస్‌మేట్స్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి షాకిచ్చారు నాగార్జున. ఆ తర్వాత హౌస్‌మేట్స్ ఓ చిన్న పని చెప్పారు. ఓ స్టాంపును తెప్పించారు. దానిమీద వేస్ట్ అని రాసుంది. హౌస్‌లో ఎవరు అందరికంటే వేస్టో వాళ్ల ముఖమ్మీద దాన్ని ముంద్రించి కారణాలు చెప్పమన్నారు. దాంతో ఎవరి అంచనా ప్రకారం వాళ్లు స్టాంప్ వేశారు. శ్రీసత్యకి, వాసంతికి, షానీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆపైన ఆడియెన్స్ డెసిషన్ ప్రకారం ఆ ముగ్గురిలో షానీని ఎలిమినేట్ చేసేశారు నాగ్. మిగిలిన ఇద్దరిలో ఎవరు ఎక్కువ వేస్టో చెప్పమని హౌస్‌మేట్స్‌ని అడిగితే వాసంతి పేరు ఎక్కువ మంది చెప్పారు. దాంతో ఆమెని జైలుకు పంపి, శ్రీసత్యను తిరిగి గేమ్‌లోకి పంపారు. ఆ తర్వాత షానీ అందరి దగ్గర సెండాఫ్ తీసుకుని బైటికి వచ్చాడు. నాగ్‌తో కాసేపు మాట్లాడి, బై చెప్పి ఎగ్జిట్ అయ్యాడు.

ఊహించని అతిథులు.. కాసేపు నవ్వులు

తన కోపంతో హౌస్‌ని వేడెక్కించి, కంటెస్టెంట్స్ ని బాగా వణికించిన నాగ్.. ఆ తర్వాత వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. అందుకుగాను ఇద్దరు ప్రత్యేక అతిథుల్ని పిలిచారు. వాళ్లే.. అమల, శర్వానంద్. ‘ఒకే ఒక జీవితం’ ప్రమోషన్‌లో భాగంగా వీళ్లిద్దరూ ఈ వారం షోకి వచ్చారు. మొదట నాగ్‌తో కాసేపు ముచ్చట్లు చెప్పి, ఆ తర్వాత కంటెస్టెంట్లతో కబుర్లాడారు. హౌస్‌మేట్స్‌ని పరిచయం చేయమని బాలాదిత్యతో చెప్పారు నాగ్. అతను ఒక్కొక్కరి గురించి చెబుతుంటే వాళ్లపై సెటైర్లు వేస్తూ నవ్వించారాయన. గీతూ చాలా డేంజరస్ అని అమలకి చెప్పారు. రేవంత్‌ని పాట పాడమని అడిగారు. అతను నాగార్జున, అమల నటించిన ‘నిర్ణయం’ చిత్రంలోని ‘హలో గురూ ప్రేమ కోసమే’ పాట పాడితే.. ఈ పాటకీ నాకూ సంబంధం లేదంటూ నాగ్ నవ్వేశారు. శర్వానంద్‌కి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్, రామ్‌ చరణ్‌లను ఇమిటేట్ చేయమని సూర్యని అడిగారు. అతను వారిలా మాట్లాడితే శర్వానంద్ చాలా ఆశ్చర్యపోయాడు. ఇలా కాసేపు అందరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశాక ఎపిసోడ్‌ని ముగించి వెళ్లిపోయారు నాగ్. 

మొత్తానికి నాగార్జున కోపం చూసి అందరూ బిక్కచచ్చిపోయారు. బ్రేక్ టైమ్‌లో సూర్య ఎమోషనల్ అయిపోయాడు. నీ ఆట నువ్వు ఆడు, ఓపెన్ అవ్వు అని అందుకే చెప్పాను, నువ్వు వినలేదు అంటూ ఆరోహి అతనికి క్లాస్ పీకింది. నువ్వు రేసులో లేనప్పుడు పక్కోడిని గెలిపించకూడదు, నువ్వు గెలవాలి అంటూ ఓదార్చింది. పైకి మాట్లాడకపోయినా బహుశా మిగతావాళ్ల పరిస్థితీ ఇదే. నాగ్ చివర్లో కాసేపు నవ్వించి పోయినా ఆయన అన్న మాటలు మర్చిపోవడం కష్టమే. మరి ఇప్పటికైనా అందరూ తమ ఆట తీరును మెరుగుపర్చుకుంటారో లేదో, అంతకంటే ముందు రేపటి ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ప్రస్తుతానికైతే అభినయశ్రీ పేరు ప్రచారంలో ఉంది. అది నిజమవుతుందో లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాలి.