మరణంలోనూ వీడని బంధం

మరణంలోనూ వీడని బంధం

ఇద్దరు హనుమాన్ భక్తులు మృతి

చొప్పదండి, వెలుగు : కొండగట్టు అంజన్నను దర్శించుకుందామని పాదయాత్రగా బయలుదేరిన ఇద్దరు హనుమాన్ భక్తులను లారీ మృత్యువు రూపంలో కాటేసింది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నంకు చెందిన పొన్నం అరుణ్(22),పులి రాజేందర్(22) బంధువులే కాకుండా చిన్నతనం నుంచి కలిసి చదివారు. గ్రామానికి చెందిన గీత కార్మికుడు పొన్నం మల్లేశం, రేషన్ డీలర్ తిరుపతవ్వల కుమారుడైన అరుణ్ డిగ్రీ వరకు చదివాడు. తండ్రి గత ఏడాది మరణించడంతో రేషన్ షాపులో తల్లికి సహకారం అందిస్తూనే సొంతంగా టెంట్ హౌజ్ దుకాణం, ఆటో నడిపిస్తున్నాడు. కొన్నేళ్లుగా హనుమాన్ దీక్ష తీసుకుంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పులి స్వరూప,రాములు కుమారుడైన పులి రాజేందర్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. కొద్ది నెలల క్రితం డెకరేషన్ దుకాణం ఏర్పాటు చేసుకొని సొంతంగా ఉపాధి పొందుతున్నాడు.

చిన్నతనం నుంచి మంచి స్నేహితులుగా ఉన్న అరుణ్, రాజేందర్ కలిసి వ్యాపారం చేస్తూ భవిష్యత్తు కు బాటలు వేసుకుంటున్నారు. హనుమాన్ మాల వేసుకున్నవీరిద్దరూ గ్రామంలోని మరో 50 మందితో కలిసి గురువారం సాయంత్రం కొండగట్టుకు బయలుదేరారు. రాత్రంతా దాదాపు 40 కి.మీ. నడిచి కొడిమ్యాల మండలంలోని పూడూరు సాయిబాబా టెంపుల్ వద్ద కొంతసేపు సేద తీరారు. శుక్రవారం తెల్లవారు జామున తొమ్మిది మంది విడివిడిగా వెళుతున్నారు. అరుణ్, రాజేందర్ రోడ్డు పక్కనుంచి నడుస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిం ది. ప్రమాదంలో అరుణ్ అక్కడికక్కడే చనిపోగా రాజేందర్ హాస్పిటల్క కు తరలిస్తుండగా మృతిచెందాడు. అంజన్నను దర్శించుకొని వస్తామని వెళ్లిన ఇద్దరు స్నేహితులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరికి కుటుంబ సభ్యులు ఒకేచోట అంత్యక్రియలు చేపట్టారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు.