మన శరీరానికి నీరు చాల అవసరం. శరీరం సక్రమంగా పనిచేయాలంటే రోజు సరిపడ నీరు తాగాలి. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల శరీరానికి బోలెడన్ని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు నిద్ర లేవగానే కాఫీ లేదా టి తాగుతుంటారు... కానీ వీటి కంటే నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు తాగితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో నీరు త్రాగితే ఏమవుతుంది:
1. మనం రాత్రంతా నిద్రపోయినప్పుడు శరీరానికి నీరు అందదు. అందుకే ఉదయం లేవగానే వచ్చే మూత్రం ముదురు రంగులో ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు నీరు త్రాగితే శరీరం వెంటనే ఉత్తేజం పొందుతుంది.
2. ఉదయం నీరు త్రాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల మనం టిఫిన్ సమయంలో ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోకుండా ఉంటాము. ఇలా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
3. నీరు త్రాగడం వల్ల శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) పెరుగుతుంది. మనం త్రాగిన నీటిని శరీరం వేడి చేయడానికి కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. దీనివల్ల కొవ్వు కరగడానికి, బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
4. శరీరంలో నీరు తగ్గితే మెదడు సరిగ్గా పనిచేయదు. ఏకాగ్రత దెబ్బతింటుంది, త్వరగా అలసిపోతాము. ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
5. నీరు త్రాగడం వల్ల తిన్న ఆహారం మెత్తగా మారి జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగుల కదలికను సులభతరం చేస్తుంది, దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు.
6. మనం నిద్రపోయే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను (ట్యాక్సిన్స్) బయటకు పంపడానికి నీరు అవసరం. ఉదయం నీరు త్రాగడం వల్ల కిడ్నీలు ఈ వ్యర్థాలను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి.
అయితే రోజు నిద్రలేవగానే 1 నుండి 2 గ్లాసుల అంటే సుమారు అర లీటరు నీరు త్రాగడం మంచిది. ఉదయాన్నే నీటిలో చక్కెర లేదా తీపి పదార్థాలు కలపకండి ఎందుకంటే దీనివల్ల మళ్ళీ దాహం వేస్తుంది. చల్లటి నీరు కాకుండా, గోరువెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు త్రాగడం జీర్ణక్రియకు చాలా మంచిది. మీరు ఉదయం పూట ఎక్సర్‌సైజ్ చేసేవారైతే, ఇంకాస్త ఎక్కువ నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.
