బాల్కొండ, వెలుగు: ఇంట్లో దేవుడి వద్ద వెలిగించిన దీపం తగిలి అన్నదమ్ములకు చెందిన రెండు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో నగదు, గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. పౌర్ణమి సందర్భంగా బక్కన్న భార్య పద్మ ఇంట్లో దేవుడి వద్ద దీపం వెలిగించి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికే మంటలు చెలరేగి ఇంటిని చుట్టుముట్టాయి. అనంతరం పక్కనే ఉన్న అతని అన్న రాజేశ్వర్ ఇంటికీ వ్యాపించడంతో రెండు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి.
స్థానికులు వెంటనే నీటితో మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే ఇళ్లలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. బక్కన్న ఇంట్లో ఉన్న రూ.15,800 నగదు, గృహోపకరణాలు, రాజేశ్వర్ ఇంట్లోని రూ.8,000 నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి. రెండు ఇళ్లలో కలిపి సుమారు రూ.25 వేల మేర నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. తక్షణ సాయంగా బక్కన్న, రాజేశ్వర్ కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. పూర్తి నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
