ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష
  • ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు తీర్పును అమలు చేయనందుకు..
  • వారం రోజుల జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

అమరావతి: ఏపీ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువడించింది. ఇద్దరు ఐఏఎస్ సర్వోన్నత అధికారులకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు కలకలం రేపుతోంది. ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలన్న తమ తీర్పును అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. క్రమ శిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ వారం రోజుల జైలు శిక్ష విధించింది. 
36 మంది ఉద్యోగులను క్రమబద్దీకరించాలని గత ఏప్రిల్ లో హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదు. చేస్తామని చెప్పి కాలయాపన చేస్తుండడంపై హైకోర్టు స్పందించి మళ్లీ గుర్తు చేసింది. అయినా తీర్పు అమలు కానందుకు బాధితులు మరోసారి కోర్టు తలుపు తట్టారు. పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టగా కోర్టు హెచ్చరికల నేపధ్యంలో ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ కూడా వ్యక్తిగతంగా హాజరయ్యారు. తీర్పులను ఆషామాషీగా తీసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నట్ల తీర్పు చెప్పింది.

కోర్టు తీర్పు పై ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేపింది. ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక న్యాయవాది ద్వారా తీర్పును అమలు చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో హైకోర్టు శాంతించి.. జైలు శిక్షను రద్దు చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ చర్యతో శాంతించినట్లు కాదని.. తమ తీర్పును హెచ్చరికగా భావించాలని హైకోర్టు స్పష్టం చేసింది.