
రాంచీ: జార్ఖండ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం (మే 24) తెల్లవారుజూమున లతేహార్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. భద్రత దళాల కాల్పుల్లో నక్సల్ తిరుగుబాటు సంస్థ జార్ఖండ్ జన ముక్తి పరిషత్ చీఫ్ పప్పు లోహ్రా, ప్రభాత్ గంజు మృతి చెందారు. పరిషత్ చీఫ్ పప్పు లోహ్రా రూ.10 లక్షలు, ప్రభాత్ గంజు తలపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, లతేహార్ జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలు ఎదురుపడగా.. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. భద్రతా దళాలు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరో నక్సలైట్ గాయపడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని.. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని తెలిపారు.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు కంచుకోటైన ఛత్తీస్గఢ్ నారాయణ పూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవ్ కూడా ఉన్నారు. పార్టీ సుప్రీం కమాండర్ మృతితో భారీ ఎదురు దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ.. తాజాగా జార్ఖండ్లో మరో షాక్ తగలింది.