ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి
  • ఆసిఫాబాద్  జిల్లాలో ఘటన

ఆసిఫాబాద్ ,వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం పిడుగు పడి ఇద్దరు చనిపోయారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్ట చెలిమ గ్రామానికి చెందిన ఆత్రం దేవ్ రావు( 22) అనే యువ రైతు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం ఆత్రం దేవ్ రావు తన పొలంలో పనులు చేసి ఇంటికి తిరిగి వస్తుండగాఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడటంతో దేవ్ రావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అలాగే ఆసిఫాబాద్ మండలం హీరాపుర్ గ్రామంలో శనివారం చేనులో పనిచేస్తున్న తల్లీకూతురిపై పిడుగు పడడంతో కూతురు స్పాట్ లోనే చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడ్డారు. హీరాపూర్  గ్రామానికి చెందిన బోయిరే విట్టూ -లక్ష్మీబాయి దంపతులకు కొడుకు బండు, కూతురు మీనా (24) ఉన్నారు.  వారంతా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. శనివారం కుటుంబ సభ్యులందరూ తమ చేనులో పత్తి పంటకు యూరియా వేసేందుకు వెళ్లారు. తండ్రీకొడుకులు ఒకపక్కన పనిచేస్తుండగా, తల్లి కూతురు మరో దిక్కున పనిచేస్తున్నారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఈ క్రమంలో తల్లీకూతురిపై పిడుగు పడడంతో కూతురు మీనా (24 ) అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి లక్ష్మీబాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబీకులు హాస్పిటల్ కు తరలించారు.