ఆరేండ్ల బాలికపై అత్యాచారం, హత్య.. యూపీలోని బులంద్‌‌షహర్‌‌‌‌లో ఘటన

ఆరేండ్ల బాలికపై అత్యాచారం, హత్య.. యూపీలోని బులంద్‌‌షహర్‌‌‌‌లో ఘటన

 

  • పోలీసుల ఫైరింగ్‌‌లో నిందితులకు గాయాలు, అరెస్టు

బులంద్‌‌షహర్: ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం జరిగింది. ఆరేండ్ల బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌‌రేప్‌‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను బిల్డింగ్‌‌ పైనుంచి కిందికి విసిరేశారు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. యూపీలోని బులంద్‌‌షహర్‌‌‌‌లో ఓ కుటుంబం ఉంటున్నది. వాళ్లు ఉంటున్న బిల్డింగ్‌‌లోనే ఇద్దరు యువకులు అద్దెకు ఉంటున్నారు. 

శుక్రవారం బిల్డింగ్‌‌పై ఆడుకునేందుకు వెళ్లిన ఆరేండ్ల బాలికపై ఆ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బిల్డింగ్ పైనుంచి పక్కనున్న ఖాళీ స్థలంలోకి విసిరేసి పారిపోయారు. తీవ్ర గాయాలైన బాధితురాలిని కుటుంబసభ్యులు, స్థానికులు గుర్తించి దగ్గర్లోని హెల్త్ సెంటర్‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్ పొందుతూ బాలిక చనిపోయింది. తాము ఉంటున్న బిల్డింగ్‌‌లోని యువకులే తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. 

బీఎన్‌‌ఎస్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు రాజు, వీర్ కష్యప్‌‌ను పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వాళ్లు ఓ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌‌లో దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. 

ఆ ఏరియాను చుట్టుముట్టారు. ఈ క్రమంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా, నిందితులిద్దరి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ చేయించి అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారని ఎస్పీ తేజ్‌‌వీర్ సింగ్ తెలిపారు.