ఫేక్ ఆధార్ కార్డులతో పోలీసులను బురిడీ కొట్టించిన మైనర్లు

ఫేక్ ఆధార్ కార్డులతో పోలీసులను బురిడీ కొట్టించిన మైనర్లు
  • పెండ్లి చేసుకుని ఫేక్​ ఆధార్​ కార్డులతో పోలీసుల దగ్గరకు..
  • అమ్మాయి తల్లిదండ్రుల  ఫిర్యాదుతో వెలుగులోకి..

మేళ్లచెరువు,వెలుగు: పెండ్లి చేసుకుని ఫోర్జరీ ఆధార్​కార్డు చూపించి మేజర్లమంటూ పోలీసులను బురిడీ కొట్టించారు ఇద్దరు మైనర్లు. రక్షణ కావాలని పీఎస్​కు రావడంతో పోలీసులు సర్టిఫికెట్లు పరిశీలించకుండానే తల్లిదండ్రులను పిలిపించి పేపర్ కూడా రాయించుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాఈ మేళ్లచెరువులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మేళ్లచెరువుకు చెందిన ఓ యువకుడు మునగాల మండలం బరాఖత్ గూడానికి చెందిన యువతి ప్రేమించుకుని ఈ నెల1వ తేదీన పెండ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలంటూ మేళ్లచెరువు పోలీసులను ఆశ్రయించారు. తాము మేజర్లమని ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డులను చూపించారు. అయితే, పోలీసులు సర్టిఫికెట్లను పరిశీలించకుండా అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించారు. వారితో అమ్మాయిని ఇబ్బందులకు గురిచెయ్యమని పేపర్​రాయించుకున్నారు. అమ్మాయి పేరెంట్స్ ను పిలవగా వారు తమకు సంబంధం లేదని వెళ్లిపోయారు.

కొన్ని రోజుల తర్వాత అమ్మాయి పేరెంట్స్​తమ కూతురు మైనర్ అని పలు ఆధారాలను చూపడంతో పాటు అబ్బాయిపై మునగాల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మునగాల పోలీసుల విచారణలో అమ్మాయికి 16 ఏండ్లని, అబ్బాయికి 18 ఏండ్లు అని గుర్తించారు. మేళ్లచెరువులో ఫోర్జరీ ఆధార్ కార్డులను చూపించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తేల్చారు. అబ్బాయిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కింద కేసులు నమోదు చేశారు.