కొమురం భీం కలెక్టర్, ఎస్పీలకు రెండు నెలల జైలు

కొమురం భీం కలెక్టర్, ఎస్పీలకు రెండు నెలల జైలు

కోర్టు ధిక్కరణ కేసులో కొమురంభీం జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జ్ ఎస్పీ సహా పలువురు అధికారులకు రెండు నెలల జైలు శిక్ష విధించింది హైకోర్టు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అప్పటి జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ సత్యనారాయణ, కాగజ్ నగర్ ఆర్డీవో చిత్రు, చింతలమానేపల్లి తహసీల్దార్ బికర్న్ దాస్, ఎస్సై శ్రీనివాస్‌లకు జైలు శిక్షతో పాటు రెండు వేల చొప్పున జరిమానా విధించింది. చింతలమానేపల్లిలో ఎకరం 32 గుంటల్లో నిర్మించిన పోలీస్ స్టేషన్ స్థల వివాదంలో ఈ నెల 17న హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ స్థలం తమదంటూ హైకోర్టును ఆశ్రయించారు రౌతు సైదాబాయి, రౌతు రేనుబాయి. అయితే గతంలో కోర్టు విచారణ సమయంలో.. పట్టాదారు భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేవని అధికారులు తప్పుడు నివేదిక సమర్పించారు. దీంతో సంబంధిత అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా జిల్లా అధికారులు బాధితులకు నష్టం కలిగించడంతో పాటు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మండిపడింది న్యాయస్థానం.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు 2019 డిసెంబర్ 24న సంబంధిత భూమిని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీంతో పట్టాదారు ఆర్డీఓతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. కోర్ట్ ఆదేశాలతో.. పంచనామా చేసిన అధికారులు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవని కోర్టుకు నివేదిక అందించారు. పట్టాదారు సమర్పించిన ఎవిడెన్స్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ వేర్వేరుగా ఉండటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా భావించి శిక్ష విధించింది. తీర్పు అమలుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు.

మరిన్ని వార్తల కోసం..

మతమార్పిడుల కేసు: మౌలానా సిద్ధిఖీని అరెస్ట్ చేసిన ఏటీఎస్

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం