గొర్రెల స్కామ్​లో మరో ఇద్దరు అరెస్టు

గొర్రెల స్కామ్​లో మరో ఇద్దరు అరెస్టు
  • పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌ కృష్ణయ్య అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ నిర్ధారణ
  • నకిలీ బిల్లులతో గొర్రెల కొనుగోళ్లలో గోల్‌‌మాల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీం స్కామ్‌‌లో అరెస్ట్‌‌లు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధకశాఖ జాయింట్‌‌ డైరెక్టర్‌‌ అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ పి.కృష్ణయ్యను ఏసీబీ గురువారం అరెస్ట్‌‌ చేసింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజిలప్ప, కృష్ణయ్య ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారు.

గొర్రెలు కొనకుండానే కొని అమ్మినట్లు రైతుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను కలెక్టర్లకు సమర్పించారు. రైతుల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కలెక్టర్ల నుంచి డబ్బులు సైతం మంజూరు చేయించారు. గొర్రెల కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా తుంగలోతొక్కి ప్రైవేటు వ్యక్తుల చేతికి కొనుగోలు వ్యవహారాన్ని అప్పగించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రైవేటు వ్యక్తులకు ప్రాధాన్యం

గొర్రెల కొనుగోలుకు వెళ్లిన అధికారులు, అసిస్టెంట్‌‌ డైరెక్టర్లు కూడా ప్రైవేటు వ్యక్తులు చెప్పిన విధంగా నడుచుకోవాలని ఈ ఇద్దరు అధికారులు ఆదేశించారు. గొర్రెలను విక్రయించేది ఎవరు అనేది కూడా చూడకుండానే ప్రైవేటు వ్యక్తులు చెప్పినట్టుగా కొనుగోళ్లు జరపడం, ప్రభుత్వ అధికారులు పూర్తి చేయాల్సిన పత్రాలు కూడా ప్రైవేటు వ్యక్తులే పూర్తి చేసే విధంగా చేశారు.

దీంతో గొర్రెలను కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని పశుసంవర్ధక శాఖ వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసి అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇలా మొత్తం రూ.2.10 కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంలో ఇద్దరు అధికారులు కీలకపాత్ర పోషించారని ఏసీబీ అధికారులు గుర్తించారు.