నిర్మల్ నుంచి తరలిపోయిన NHA ఆఫీస్

నిర్మల్ నుంచి తరలిపోయిన NHA ఆఫీస్

నిర్మల్,వెలుగు:నిర్మల్ జిల్లా మీదుగా వెళ్తున్న రెండు నేషనల్ హైవేలు, మరో స్టేట్ హైవే నిర్వహణకు ఇబ్బందులు తప్పేలా లేవు..  నాలుగు వైపుల విస్తరించిన నేషనల్, స్టేట్ హైవేల కారణంగా అంతర్రాష్ట్ర కనెక్టివిటీ విస్తరించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్​గఢ్, ఒడిశాకు హైవేలు కలుస్తున్నందున రవాణా, ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు పెరిగాయి. హైదరాబాద్ ​టు ఆదిలాబాద్ నేషనల్​హైవే 44, మహారాష్ట్రలోని కళ్యాణ్​ నుంచి నిర్మల్ వరకు ఉన్న హైవే 61ను నిర్మల్​లోని  నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ ఆఫీస్ నుంచి పర్యవేక్షించేవారు. నిర్మల్ ​నుంచి ఖానాపూర్​వరకు నిర్మిస్తున్న స్టేట్ హైవే, బోధన్ టు భైంసా వరకు చేపట్టనున్న స్టేట్​హైవే పనులను ఆజమాయిషీ చేసేవారు. సాంకేతిక పరమైన సహకారం అందించేవారు. అవసరమైన చోట్ల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేవారు. ఎలాంటి చిన్న ఇబ్బందులైనా.. తొందరగా పరిష్కారానికి నోచుకునేది. ఎన్ హెచ్ఏఐ పీడీ ఆఫీస్​ను ఉన్నతాధికారులు కామారెడ్డికి తరలించడంతో నిర్వహణ పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు.

రెండు స్టేట్​ హైవేలకు ఇబ్బందులే...
నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ ఆఫీస్ తరలిపోవడంతో నిర్మల్​ నుంచి ఖానాపూర్ వరకు నిర్మిస్తున్న స్టేట్​ హైవే 61, బోధన్ ​-నుంచి బాసర మీదుగా భైంసా వరకు ఉన్న మరో స్టేట్​హైవే నిర్మాణ పనులకు టెక్నికల్​ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. బోధన్– -భైంసా హైవే పనులకు ఇటీవల టెండర్​ ప్రక్రియ పూర్తయ్యింది. నేషనల్ హైవే తరహాలో నిర్మించనున్న ఈ రోడ్డుకు రూ.520 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిర్మల్– ఖానాపూర్​వరకు నిర్మిస్తున్న మరో స్టేట్​హైవే కోసం రూ. వంద కోట్లు రిలీజ్​చేశారు. ఈ రెండు  హైవేల కోసం ఆర్​అండ్​బీ ఆఫీసర్లు నేషనల్ హైవే అథారిటీ నుంచి టెక్నికల్​సహకారం తీసుకుంటున్నారు. క్వాలిటీపై సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. ఇక్కడి ఆఫీస్​ కామారెడ్డికి తరలిపోవడంతో ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న హైవేల నిర్వహణ, ఇతర పనులు తూతూమంత్రంగా సాగే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో క్వాలిటీ దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. 

పాలన సౌలభ్యం కోసమే
పాలన సౌలభ్యం కోసమే ఎన్​హెచ్​ఏఐ పీడీ ఆఫీస్​ను కామారెడ్డికి తరలిస్తున్నారు. ఆఫీస్​తరలింపుతో రోడ్ల నిర్వాహణకు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కామారెడ్డి ఏరియాలే సిక్స్​లేన్​పనులు కొనసాగుతున్నాయి. వాటి పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సి ఉంది. నిర్మల్​ఏరియాలోని హైవేలను కన్సల్టెన్సీ సర్వీసులు చూసుకుంటాయి. నిర్మల్​టు ఖానాపూర్​వరకు నిర్మిస్తున్న స్టేట్​హైవే పనులు, బోధన్​టు భైంసా హైవే పనులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.
– సుభాష్​, డీఈ నేషనల్ హైవే ఆర్​అండ్​బీ, నిర్మల్​