జమ్మూలో ఎన్‌కౌంటర్.. సోల్జర్ జశ్వంత్ రెడ్డి మృతి

జమ్మూలో ఎన్‌కౌంటర్..  సోల్జర్ జశ్వంత్ రెడ్డి మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కంటిన్యూ అవుతోంది. గురువారం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఇద్దరు జవాన్లను నాయబ్ శ్రీజిత్, సిపాయి మరుపోలు జశ్వంత్ రెడ్డి(23)లుగా గుర్తించారు. ఉగ్రవాదుల చొరబాట్లపై విశ్వసనీయ సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా.. రాజౌరి జిల్లా దాదల్ ఏరియాలో సెక్యూరిటీ ఫోర్సెస్ పైకి టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా భద్రతా బలగాల మీదికి హ్యాండ్ గ్రెనెడ్స్ కూడా విసిరారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు చనిపోయారు. వారి దగ్గర రెండు AK-47 రైఫిల్స్ సహా పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

కాగా.. జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సిపాయి జశ్వంత్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం. ఆయన మే 17, 2016న మద్రాస్ రెజిమెంట్‌లో చేరారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం జమ్మూకశ్మీర్‌లో విధుల్లో చేరారు. జశ్వంత్‌కు త్వరలోనే వివాహం చేయాలని భావించిన తల్లిదండ్రులు.. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాదకొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.