లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి

లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి
  •     13 మందికి తీవ్ర గాయాలు
  •     ఐదుగురి పరిస్థితి విషమం..
  •     వికారాబాద్ జిల్లా పులుసుమామిడి గేట్ సమీపంలో ఘటన
  •     కాటారంలో ఇద్దరు, పాల్వంచ పరిధిలో మహిళ మృతి

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా పులుసుమామిడి గేట్ సమీపంలో గురువారం ఆటో, లారీ ఢీకొని ఇద్దరు చనిపోగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్లకొండ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది పని కోసం ఆటోలో వికారాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. వికారాబాద్ మండలం పులుసుమామిడి గేట్ సమీపంలో సిమెంట్ ట్యాంకర్ అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని బోడ కిష్టయ్య(55) అక్కడిక్కడే చనిపోయాడు. 

తీవ్రంగా గాయపడ్డ గొల్లగూడ బుచ్చమ్మ(50)ను ఉస్మానియా దవాఖానకు తరలిస్తుండగా మరణించింది. ఆటో డ్రైవర్ షాకీర్, గొల్లగూడ కిష్టయ్య, గొల్లగూడ సత్యమ్మ, గొల్లగూడ అంతయ్య, జోగు రాం చంద్రయ్య, బోడ పుష్పమ్మ, పర్వేద పార్వతమ్మ, కొండగళ్ల జంగయ్య, పెంటని నర్సింహులు, పెంటని రత్నమ్మ, బోడ లక్ష్మి,గొల్లగూడ చంద్రమ్మ, గొల్లగూడ జంగమ్మ తీవ్రంగా గాయపడగా వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇందులో కొందరిని సంగారెడ్డి, హైదరాబాద్​ హాస్పిటల్స్​కు రెఫర్​ చేశారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ నాగరాజు గాయపడ్డవారితో మాట్లాడి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

ఇసుక ట్రాక్టర్​ పై నుంచి వెళ్లడంతో...

కాటారం : జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట ఆయుష్ దవాఖానలో పనిచేస్తున్న కాపరబోయిన రాజయ్య.. గ్రామానికి చెందిన బాపుతో కలిసి టూవీలర్​పై విలాసాగర్ వెళ్తున్నాడు. అటువైపు నుంచి వస్తున్న మరో బైక్​ రాజయ్య  టూ వీలర్​ను ఢీకొట్టింది. దీంతో రాజయ్య కిందపడగా ఇసుక ట్రాక్టర్ పై నుంచి వెళ్లింది. దీంతో రాజయ్య అక్కడికక్కడే చనిపోయాడు. అయిలాపురం బాపు కాలు విరగడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అభినవ్​ తెలిపారు.

పెళ్లి ట్రాక్టర్​ బోల్తా పడి.. 

పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని మొండికట్ట వద్ద గురు వారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా కుంట మండలం తొండమర్క గ్రామానికి చెందిన 15 మంది ట్రాక్టర్​లో ఆళ్లపల్లి మండలం సింగారంలో పెండ్లికి వచ్చారు. తిరిగి సింగారం నుంచి మొండికట్ట మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా మొండికట్ట మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయారు. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడగా మడివి బండి( 35) అక్కడిక్కడే మరణించింది.  మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాల్వంచ  ఎస్సై  శ్రీనివాస్ తెలిపారు.