మా భూమిని వేరేవాళ్లకు పట్టా ఎలా చేశావ్​?

మా భూమిని వేరేవాళ్లకు పట్టా ఎలా చేశావ్​?
  • మా భూమిని వేరేవాళ్లకు పట్టా ఎలా చేశావ్​?

  • ప్రశ్నించడంతో తహసీల్దార్ ​పరుగు!

  • కరీంనగర్  కలెక్టరేట్​లో ఘటన 

  • గ్రీవెన్స్​​లో బైఠాయించిన అక్కాచెల్లెళ్లు

  • బయటకు తీసుకువెళ్లిన పోలీసులు

కరీంనగర్, వెలుగు : తమ తండ్రి పేరు మీదున్న భూమిని వేరొకరికి పట్టా చేశారని, న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్​కలెక్టరేట్​లోని గ్రీవెన్స్​ సెల్​లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు బైఠాయించారు. అక్కడే సూపరింటెండెంట్​గా ఉన్న మాజీ తహసీల్దార్​ను గుర్తించి నిలదీయగా అక్కడి నుంచి వేరే రూమ్​లోకి వెళ్లిపోయారు. బాధితుల కథనం ప్రకారం..సైదాపూర్ మండలం ఎల్లంపల్లెకు చెందిన మేడవేని వెంకటయ్య తండ్రి పేరు మల్లయ్య. వెంకటయ్యకు ఐదుగురు బిడ్డలున్నారు.

వెంకటయ్యకు ప్రభుత్వం గొడిశాల రెవెన్యూ పరిధిలోని 1085/6 సర్వే నంబర్ లో ఎకరం భూమిని అసైన్ ​చేసింది. బిడ్డలందరికీ పెండ్లిళ్లు చేసి పంపించాడు. ఇదే గ్రామంలో వేడవేని వెంకటయ్య పేరుతో ఆయన దాయాది మరొకరున్నారు. ఆయన తండ్రి పేరు రాజయ్య. ఈ క్రమంలోనే మేడవేని వెంకటయ్య( సన్ ఆఫ్ మల్లయ్య) 2011లో చనిపోయాడు. భూరికార్డుల ప్రక్షాళన టైంలో ఆ ఎకరం భూమి వేడవేని వెంకటయ్య(సన్ ఆఫ్ రాజయ్య) పేరిట నమోదైంది. దీంతో అప్పటి నుంచి వెంకటయ్య బిడ్డలు తమ తండ్రి భూమి కోసం తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్ కు వెంకటయ్య బిడ్డలు ప్రమీల, పద్మ  రాగా.. గతంలో సైదాపూర్ తహసీల్దార్ గా పని చేసి ప్రస్తుతం కలెక్టరేట్ లో సూపరింటెండెంట్ గా ఉన్న సురేఖ కనిపించారు. దీంతో ‘మీరే మా భూమిని వేరొకరికి పట్టా చేశారు’ అని నిలదీశారు.  దీంతో ఆమె తన సీటులోంచి లేచి వేరొక రూమ్ లోకి పరిగెత్తారు. దీంతో అక్కాచెల్లెళ్లిద్దరూ కొద్దిసేపు గ్రీవెన్స్ సెల్ హాల్ లో కింద కూర్చుని నిరసన తెలిపారు. సురేఖను సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటికి తీసుకెళ్లారు.