శ్రీనగర్: జమ్ముూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో సైనికుడు, ఇద్దరు స్థానిక పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంత్నాగ్ జిల్లాలోని అహ్లాన్ గడోల్లో ఇవాళ సాయంత్రం ఎన్కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. కోకర్నాగ్ సబ్ డివిజన్లోని అడవుల్లో యాంటీ-టెర్రర్ ఆపరేషన్ సాగిస్తున్న సైనికులను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు సమాచారం. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల జాడకు సంబంధించిన సమాచారంతో భారత సైన్యం యాంటీ టెర్రర్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అడవిలో నక్కి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనికులు కూడా కౌంటర్గా కాల్పులు జరిపారు.
ఇటీవల జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఒక సైనికుడు వీరమరణం పొందాడు. కుల్గాం జిల్లాలోని మోడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. జూలై 6వ తేదీ శనివారం రాత్రి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్ ప్రాంతంలోని గాడోల్ అడవుల పర్వతాలలో ఉగ్రవాదుల ఉనికి ఎక్కువగా ఉంది. ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారంతో భద్రతా దళాలు డ్రోన్లను ఉపయోగించి వారి కదలికలను ఇటీవల ట్రాక్ చేశాయి. గాడోల్ అడవుల్లోని కొండ ప్రాంతంలోని 10-15 అడుగుల పొడవైన గుహలో ఉగ్రవాదులు దాక్కున్నారు.
