- మూడు గ్రనేడ్లు, పిస్టల్ స్వాధీనం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి నుంచి మూడు గ్రనేడ్లు, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. టెర్రరిస్టులను హరి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్, మన్వర్ హుస్సేన్‌లుగా గుర్తించారు.
శుక్రవారం రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) పోలీసులు పూంచ్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని అధికారులు తెలిపారు. ఓ ఇంటిలో అజీజ్‌ను, అతని అనుచరుడు హుస్సేన్‌ను అరెస్టు చేశామన్నారు. వీరిద్దరికీ జమ్మూకాశ్మీర్ ఘజ్వా-ఏ-హింద్ (జేకేజీఎఫ్) గ్రూప్ తో సంబంధాలున్నాయని చెప్పారు.
అంతేగాక.. మతపరమైన ప్రదేశాలు, ఆసుపత్రులపై వీళ్లు గ్రనేడ్ దాడులు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. టెర్రర్ ఫైనాన్సింగ్, దేశ వ్యతిరేక ప్రచారం, స్మగ్లింగ్‌తో సహా టెర్రర్ యాక్టివిటీల్లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు వివరించారు. పూంచ్ జిల్లాలో వేర్వేరు చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపారు. సమీప అడవుల్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.