టూవీలర్లు కొనేవారు తగ్గారు

టూవీలర్లు కొనేవారు తగ్గారు

 

  • పేరుకుపోతున్న ఇన్వెంటరీ
  • డీలర్లకు భారీ నష్టాలు
  • ఉత్పత్తిని తగ్గించిన కంపెనీలు

న్యూఢిల్లీ: టూవీలర్ల షోరూముల్లో బైకులు ఎప్పటిలాగే మెరిసిపోతున్నాయి కానీ కొనడానికి వచ్చే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌, మే నెలల్లో అమ్మకాలు లేకపోవడంతో డీలర్ల దగ్గర మూడు లక్షల టూవీలర్లు షోరూముల్లో అలాగే పడి ఉన్నాయి. దీంతో తయారీ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి. కన్జూమర్‌‌ డిమాండ్‌‌ అత్యల్పంగా నమోదవుతోంది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో అమ్మకాలు 8.6 శాతం తక్కువ నమోదు కావడంతో కంపెనీలకు ఏం చేయాలో తోచడం లేదు. గత నెల సగటు ఇన్వెంటరీ స్థాయి 10 శాతం పెరిగిందని ఫెడరేషన్‌‌ ఆఫ్ ఆటోమొబైల్‌‌ డీలర్స్ అసోసియేషన్‌‌ (ఎఫ్‌‌ఏడీఏ) తెలిపింది. ఏప్రిల్‌‌–మేలో అమ్మకాల కంటే కంపెనీల నుంచి డీలర్లకు వచ్చిన టూవీలర్ల సంఖ్య ఆరు లక్షల కంటే ఎక్కువని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్‌‌ కాలే చెప్పారు. ఏప్రిల్‌‌లో 13 లక్షలు, మేలో 14 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే వీటిలో ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రాల లెక్కలు లేవన్నారు. ఇప్పటికీ మూడు లక్షల యూనిట్లు అమ్ముడుపోలేదని, వీటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని ఆశిష్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు.

టూవీలర్‌‌తోపాటు ప్యాసింజర్‌‌ వాహనాల (పీవీలు) అమ్మకాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి ఇన్వెంటరీ కూడా గత రెండు నెలల్లో పది శాతం పెరిగింది. మనదేశంలోని 10 టాప్‌‌ కంపెనీలు మే, జూన్‌‌ నెలల్లో ఉత్పత్తిని బాగా తగ్గించారు. ఏప్రిల్‌‌, మేలో పీవీల అమ్మకాల కంటే కంపెనీల సరఫరా 15 వేల యూనిట్లు అధికంగా నమోదయింది. కమర్షియల్‌‌ వాహనాల ఇన్వెంటరీ స్థాయులు 45–50 రోజుల వరకు ఉన్నాయి. కంపెనీల ప్లాంట్లలో ఇన్వెంటరీ భారీగానే పేరుకుపోయిందని ఎఫ్‌‌ఏడీఏ తెలిపింది.

గత 18 ఏళ్లలో భారీ తగ్గుదల

ప్యాసెంజర్ వెహికిల్ (పీవీ) సేల్స్‌‌  అమ్మకాలు ఈ ఏడాది మేలో 18  ఏళ్ల కనిష్టానికి చేరాయి. గత నెల సేల్స్ 20 శాతానికి పైగా తగ్గాయి. సేల్స్ పడిపోతుండటంతో, వాహన కంపెనీలు కూడా ఉత్పత్తిని బలవంతంగా తగ్గిస్తున్నాయి. గత నెల  పీవీ అమ్మకాలు 2,39,347 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 3,01,238 యూనిట్లుగా నమోదయ్యాయి. గత 11 నెలల్లో 10 నెలలు ప్రయాణికుల వాహనాల సేల్స్ నెగిటివ్‌‌గానే ఉన్నాయి. కానీ గత నెల విక్రయాలు మాత్రం 2001 సెప్టెంబర్ నాటి స్థాయులకు పడిపోయాయి. ఆ సమయంలో ప్యాసెంజర్ వెహికిల్ సేల్స్ 21.91 శాతం కిందకు జారాయి. టూవీలర్స్, కమర్షియల్ వెహికిల్స్ వంటి అన్ని సెగ్మెంట్లలో మే నెలలో విక్రయాలు తగ్గినట్టు సొసైటీ ఆఫ్ ఇండియాన్ ఆటోమొబైల్ మానుఫాక్చర్స్(సియామ్) డేటాలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా కారు విక్రయాలు గత నెలలో 26.03 శాతం తగ్గి 1,47,546 యూనిట్లకు పడిపోయాయి. 2018 మే నెలలో ఇవి 1,99,479 యూనిట్లు. మోటార్‌‌‌‌సైకిల్ సేల్స్‌‌ కూడా గత నెలలో 4.89 శాతం డౌన్ అయి 11,62,373 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఇవి కూడా గతేడాది ఇదే నెలలో 12,22,164 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం టూవీలర్స్ సేల్స్ మే నెలలో 6.73 శాతం క్షీణించి 17,26,206 యూనిట్లకు తగ్గిపోయాయి. కమర్షియల్ వెహికిల్స్ సేల్స్ కూడా 10.02 శాతం తగ్గి 68,847 యూనిట్లకు పడిపోయాయి.