మెదక్  జిల్లాలో గంటల వ్యవధిలో వదిన, మరదళ్ల మృతి

మెదక్  జిల్లాలో గంటల వ్యవధిలో వదిన, మరదళ్ల మృతి
  • మృతులిద్దరూ నెలలోపు బాలింతలే
  • తల్లి ప్రేమకు దూరమైన పసికందులు

మెదక్(చేగుంట), వెలుగు: మెదక్  జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో వరుసకు వదిన, మరదళ్లు అయ్యే మహిళలు గంటల వ్యవధిలో చనిపోవడంతో విషాదం నెలకొంది. మృతులిద్దరూ నెల లోపు బాలింతలు కావడంతో, పసికందులు తల్లిప్రేమకు దూరమయ్యారు. గ్రామానికి చెందిన కె.రమేశ్  భార్య స్వాతి(26)కి నెల రోజుల కింద పాప పుట్టింది. డెలివరీ తర్వాత ఆమె తన తల్లిగారి గ్రామమైన చిన్నశంకరంపేట మండలం చందంపేటలో ఉంటోంది.

శుక్రవారం రాత్రి స్వాతి సడెన్​గా తీవ్ర అనారో గ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు మెదక్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో అంత్యక్రియల కోసం స్వాతి డెడ్​బాడీని శనివారం చేగుంట మండలం రెడ్డిపల్లికి తీసుకువచ్చారు. విషయం తెలిసిన స్వాతికి వరసకు మరదలైన సౌందర్య(27) వారింటికి వెళ్లి డెడ్ బాడీని చూసి ఇంటికి తిరిగి వచ్చి పడుకుంది.

కొద్ది సేపటికే అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను నార్సింగిలోని ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన డాక్టర్​ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. సౌందర్య కూడా నెల కింద బాబుకు జన్మనిచ్చింది. ఆమె అత్తగారిల్లు గజ్వేల్​ మండలం వీరారెడ్డిపల్లి కాగా, డెలివరీ అయిన తరువాత తల్లిగారి గ్రామమైన రెడ్డిపల్లిలోనే ఉంటోంది. గంటల వ్యవధిలో  వరుసకు వదిన, మరదళ్లు అయిన ఇద్దరు బాలింతలు చనిపోవడంతో రెడ్డిపల్లిలో విషాదం నెలకొంది.