రద్దీ బస్సులు, ఆటోలే టార్గెట్‌.. 47 తులాల బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు మహిళలు

రద్దీ బస్సులు, ఆటోలే టార్గెట్‌.. 47 తులాల బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు మహిళలు

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్
రూ.24 లక్షల విలువైన 47.3 తులాల నగలు స్వాధీనం

వరంగల్​ క్రైం, వెలుగు: రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తూ నగలు కొట్టేస్తున్న ఇద్దరు మహిళలను వరంగల్​ సీసీఎస్​, లింగాల ఘన్​ పూర్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.24 లక్షల విలువైన 47.3 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్​ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్​ సీపీ డా.తరుణ్​ జోషి అరెస్టుకు సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించారు. ఏపీలోని కర్నూలు టౌన్​ బుధవారిపేటకు చెందిన అక్షింతల సంధ్య అలియాస్​ దివ్య అలియాస్​ రాణి, ఇంకో మహిళ బోయ కవిత ఇద్దరూ టైలరింగ్​ చేసేవారు. ఆ పని ద్వారా సరిపడా ఆదాయం రాకపోవడంతో హైదరాబాద్​కు మకాం మార్చి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఒంటరి మహిళలు కనిపిస్తే ఖతమే​
సంధ్య, కవిత ఇద్దరూ వేర్వేరుగా ఉంటూనే రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను టార్గెట్​ చేసేవారు. ఆ తరువాత నెమ్మదిగా వారి బంగారు నగలను దోపిడీ చేసేవారు. ఇలా ఇరువురు 2005 నుంచి 2019 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కొన్నిరోజులకు జైలుకు కూడా వెళ్లారు. కాగా పోలీసులకు పట్టుబడిన ప్రతి సారీ తమ పేర్లను తప్పుగా చెప్పేవారు.

చోరీల కోసం జతకట్టారు
జైలు నుంచి విడుదలైన అనంతరం సంధ్య, కవిత ఇద్దరూ కలిసి మళ్లీ చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. చోరీ చేసి సులభంగా తప్పించుకునేందుకని ఒక కారును కొనుగోలు చేశారు. దానిని నడిపేందుకు తమ బంధువులిద్దరినీ నియమించుకున్నారు. గతేడాది వరంగల్​ కమిషనరేట్​తో పాటు ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 11 చోరీలు చేశారు. దీంతో కంప్లైంట్స్ ఎక్కువ కావడంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులిద్దరూ తమ అనుచరులతో కల్సి లింగాలఘన్​పూర్ ప్రాంతంలోని నెల్లుట్ల బైపాస్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చోరీల విషయాన్ని ఒప్పుకున్నారు. అనుచరులు మాత్రం కారును అక్కడే వదిలి తప్పించుకున్నారు. నిందితులను అరెస్ట్​ చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్​ జోన్​ డీసీపీ పుష్ప, ఘన్​పూర్​ ఏఎస్పీ వైభవ్​ గైక్వాడ్​, క్రైం ఏసీపీ బాబూరావు, సీసీఎస్​ సీఐలు రమేశ్​ కుమార్, శ్రీనివాసరావు, ​ జనగాం రూరల్ సీఐ వినయ్ కుమార్, లింగాలఘన్​పూర్ ఎస్సై దేవేందర్, ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.