బాసర ట్రిపుల్​ఐటీ​ మెస్​ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

బాసర ట్రిపుల్​ఐటీ​ మెస్​ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో వరుసగా ఫుడ్​ పాయిజనింగ్​ ఘటనలు చోటు చేసుకున్నా మెస్​ కాంట్రాక్టర్ల తీరు మారడంలేదు. వర్సిటీలోని కేంద్రీయ బండార్​ మెస్​ కిచెన్​లో ఇద్దరు వర్కర్లు స్నానాలు చేస్తున్న ఓ వీడియో శుక్రవారం సోషల్​ మీడియాలో వైరలయ్యింది. ఇది ఎప్పుడు జరిగిందో తెలియకున్నా..కిచెన్​లో వర్కర్లు స్నానాలు చేయడం, మురికి నీరు భోజనంపై పడడంపట్ల స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళనలతో ఆధికారులు దిగివస్తున్నా.. కాంట్రాక్టర్లు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రీయ బండార్​ సంస్థ నిర్వహిస్తున్న మెస్​లో  చాలా రోజుల నుంచి  వర్కర్లు వంటలు చేసే చోటుకు దగ్గర్లోనే స్నానాలు చేస్తున్నారని స్టూడెంట్లు అంటున్నారు. స్నానాలు చేయడంవల్ల మురికి నీరు, సబ్బు నీరు వంటల్లో పడుతోందని, అందువల్లే ఫుడ్​ పాయిజన్​ అయ్యిందని భావిస్తున్నారు.

 వర్కర్లు పరిశుభ్రత  పాటించరని, వంట పాత్రలు కూడా సరిగా కడగడం లేదని  చెప్తున్నారు. స్నానాల వీడియో బయటకు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరో సారి ఆందోళనకు గురయ్యారు. మెస్​ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. కాగా.. ట్రిపుల్​ఐటీలో మెస్​ కాంట్రాక్టు పొందిన కేంద్రీయ బండార్​ సంస్థకు ఎలాంటి అనుమతి, గుర్తింపూ లేదని,  రాజకీయ పలుకుబడితోనే ఈ సంస్థ తనకు మెస్​ నిర్వహణలో అనుభవం ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి  కాంట్రాక్టు పొందిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. కాగా, ఈ వీడియో లాక్​డౌన్ ​టైమ్​నాటిదని, అప్పట్లో  వంట పాత్రలు కడిగిన తర్వాత  వర్కర్లు స్నానాలు చేశారని ఆఫీసర్లు చెబుతున్నారు.