ఆశీర్వదించండి..‘వెలుగు‘కు రెండేళ్లు

ఆశీర్వదించండి..‘వెలుగు‘కు రెండేళ్లు

మన ప్రజలు.. మన బాగోగులు..  మన ప్రయోజనాలే ఎజెండాగా ‘వెలుగు’ ముందుకు సాగుతోంది.తెలంగాణ ప్రజలకు నచ్చింది, మెచ్చిందే తన బాటగా ఎంచుకుంది వెలుగు. అన్నివర్గాలకు అవసరమైన సమాచారం ఇవ్వడం.. ప్రజలకు పనికొచ్చేది మెచ్చుకోవటం.. జనాన్ని ముంచేది అడ్డుకోవటం.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం.. ఇదే ‘వెలుగు’ చేస్తోంది. చేస్తుంది.

తెలంగాణ జనం ప్రయోజనమే ‘వెలుగు’ న్యూస్ పాలసీ. సొంత రాష్ట్రం వచ్చినంక కూడా మన నీళ్లు దోపిడీ అయితుంటే వెలుగు ఒక్కటే ఎలుగెత్తి చాటింది. కరోనాతో జనం తిప్పలు పడుతుంటే పట్టించుకోని నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. జనం ప్రాణాల్ని గాలికొదిలేసి, ప్రజల సొమ్మును వృథా చేసే నిర్మాణాలను తలకెత్తుకుంటున్న తీరును వెలుగులోకి తెచ్చింది.

తెలంగాణ బతుకు, సామాజిక న్యాయం కేంద్రంగా ‘వెలుగు’ కథనాలను అందిస్తోంది. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, నిరుపేదల పక్షాన నిలుస్తోంది. బీసీలు, దళితులు, గిరిజనుల ఆకాంక్షలను వెలుగులోకి తెస్తోంది. నిధుల దుబారా, అందని పథకాలు, అమలుకాని హామీలపై జనం తరఫున నిలదీస్తోంది. ఇవన్నీ గిట్టని సర్కారు సహజంగానే కక్షగట్టింది. అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూ చివరికి ప్రభుత్వ ప్రకటనలను నిలిపేసింది. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే వెలుగును అడ్డుకోవచ్చన్న ప్రభుత్వ కుట్రను లక్షలాది పాఠకుల అండతో ఎదుర్కొంటోంది.

V6ను ఆదరించినట్లుగానే ‘వెలుగు’ను ‘ఇది మా పత్రిక’ అని పాఠకులు గుండెల్లో పెట్టుకున్నరు. రెండేండ్ల కింద తెలంగాణ ప్రజల పత్రికగా వెలుగు జనం ముందుకు వచ్చింది. ఆ మాటకే ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న పాఠకులకు ‘వెలుగు’  యాజమాన్యం, టీమ్ తరఫున ధన్యవాదాలు. ప్రోత్సహిస్తున్న ప్రకటనకర్తలకు, సహకారం అందిస్తున్న ఏజెంట్లు, హాకర్లకు కృతజ్ఞతలు. సమాచార వారధిగా, జనం పత్రికగా అదే బాధ్యతతో మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది వెలుగు. మీ ఆదరణ, అభిమానం ఇట్లనే కొనసాగాలని కోరుకుంటోంది.

– అంకం రవి, చీఫ్ ఎడిటర్