
- నాగార్జున సాగర్‌కు భారీగా వరద సింగూరుకు జలకళ
- గరిష్ట స్థాయికి సిటీ జంట జలాశయాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాలతో నగరానికి తాగునీటిని అందిస్తున్న ప్రధాన రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే నాగార్జున సాగర్ఆరు గేట్లను ఎత్తగా, సిటీలోని జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండగా, ఎప్పుడైనా గేట్లు ఎత్తవచ్చని అధికారులు అంటున్నారు. సింగూరుకు కూడా భారీగా వరద పోటెత్తుతోంది.
ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా, 20 టీఎంసీలకు చేరింది. నిరుడుతో పోలిస్తే ఈసారి భారీగానే వరద వచ్చిందని వాటర్‌బోర్డు అధికారులు అంటున్నారు. ఏటా సెప్టెంబర్‌లో కురిసే భారీ వర్షాలకు జలాశయాలు నిండే అవకాశం ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం జులై, ఆగస్టు నాటికే నిండు కుండలను తలపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో వచ్చే రెండేండ్ల వరకు తాగునీటికి ఢోకా లేదంటున్నారు.
హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద..
హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద చేరుతోంది. బంజారా, పికెట్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి ఈ వరద వస్తోంది. హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లుగా ఉంది. ఎఫ్టీఎల్ దాటకుండా వాటర్ లెవెల్‌ను జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం మెయింటెన్ చేస్తోంది. తూముల ద్వారా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1,208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,027 క్యూసెక్కుల
ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.
సిటీకి తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో నిల్వలు(టీఎంసీల్లో)
జలాశయం పూర్తి సామర్థ్యం గతేడాది ప్రస్తుతం
1. ఉస్మాన్‌సాగర్ 3.900 1.812 2.466
2. హిమాయత్‌సాగర్ 2.967 1.663 2.621
3. సింగూరు 29.967 14.712 20.729
4. మంజీరా 1.500 0.483 0.842
5. నాగార్జున సాగర్ 312.045 284.160 304.460
6. ఎల్లంపల్లి 20.783 14.430 12.366