భైంసాలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి

    భైంసాలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి
  •     24 గంటల వ్యవధిలో ఘటనలు

భైంసా, వెలుగు: నిర్మల్ ​జిల్లా భైంసా పట్టణంలో ఇద్దరు యువకులు 24 గంటల వ్యవధిలో గుండెపోటుతో చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం పట్టణంలోని గణేశ్​నగర్ కు చెందిన చందు(36) ఇంట్లో ఉన్నట్టుండి కిందపడిపోయాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్​తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 

ఇదిలా ఉండగా సోమవారం ఉదయం మేదరిగల్లీకి చెందిన విశ్వనాథ్(29) అనే మరో యువకుడు ఛాతీలో నొప్పితో చనిపోయాడు. కులవృత్తి చేస్తూ జీవనం సాగించే విశ్వనాథ్​ఉదయం దుకాణానికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 24 గంటల వ్యవధిలోపే ఇద్దరు యువకులు గుండెపోటుతో మృతిచెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.